పౌరసత్వ సవరణ బిల్లుపై ఎలాంటి అపోహాలు పెట్టుకోవద్దని, ఇది చరిత్రాత్మక బిల్లు అని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. బిల్లు వెనుక ఓటు బ్యాంకు రాజకీయాల ప్రసక్తే లేదని ఆయన స్పష్టం  చేశారు. దేశంలో నిర్లక్ష్యానికి గురమవుతున్న శరణార్ధులకు హక్కులను కల్పించడమే ఈ బిల్లు ప్రధాన ముఖ్య ఉద్దేశమని షా చెప్పుకొచ్చారు. పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా రాజ్యసభలో పౌరసత్వ సవరణ బిల్లు-2019 (క్యాబ్)ను ఈ రోజు అమిత్‌ షా ప్రవేశపెట్టారు. అనంతరం చర్చలో పాల్గొని మాట్లాడుతూ.. ఎన్డీయే ఎన్నికల మేనిఫెస్టోలో భాగమే ఈ పౌరసత్వ బిల్లు అని అన్నారు.

బిల్లుతో భారత్‌లోని ఇండియాలోని ముస్లింలకు కానీ, ఈశాన్య ప్రాంతాల సంస్కృతికి కానీ ఎలాంటి ముప్పు ఉండబోదని అమిత్‌షా స్పష్టం చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగానే బిల్లు తీసకువచ్చామని  అన్నారు. ఈ బిల్లుపై విపక్షాలు లేనిపోని అపోహాలు సృష్టించి పెద్ద రాద్దాంతం సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. ఇలా అబద్దాలు సృష్టించే వారు తమ పద్దతి మార్చుకోవాలని అమిత్‌ షా హితవు పలికారు.

తప్పుడు ప్రచారం చేయవద్దు:

పౌరసత్వ బిల్లుపై తప్పుడు ప్రచారం చేయవద్దని, ముస్లింలకు వ్యతిరేకంగా ఈ బిల్లు లేదని స్పష్టం చేశారు. కాగా, ఈ బిల్లుకూ, భారత్‌లో ముస్లింలకు సంబంధం ఏమిటని విపక్షాలను ప్రశ్నిస్తున్నానని, అందుకు జవాబు చెప్పి తీరాలని అమిత్‌షా డిమాండ్‌ చేశారు.  పాకిస్థాన్, బంగ్లాదేశ్‌‌లలో మతపరమైన మైనారిటీల జనాభా 20 శాతం తగ్గిందని, వీరంతా చంపబడి ఉండటమో, లేదా ఆశ్రయం కోసం భారత్‌కు  పారిపోయి వచ్చి ఉండటమో జరిగి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దశాబ్దాలుగా ఇండియాలో శరణార్థులుగా ఉంటూ నిర్లక్ష్యానికి గురవుతున్న వారికి ఈ సవరణ బిల్లు పౌరసత్వ ఎంతో  ఉపయోగపడుతుందని, అందుకే ఈ బిల్లును ప్రవేశపెట్టామని పేర్కొన్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.