'బి ది రియల్ మ్యాన్' అంటున్న పరిటాల శ్రీరామ్.. నారాలోకేష్ నామినేట్
By తోట వంశీ కుమార్ Published on 26 April 2020 11:43 AM ISTదేశ వ్యాప్త లాక్‌డౌన్‌తో ప్రముఖులు అందరూ ఇళ్లలోనే ఉన్నారు. లాక్‌డౌన్ కాలంలో తాము చేసే పనులను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో 'బి ది రియల్ మ్యాన్ ఛాలెంజ్' ట్రెండింగ్‌లో ఉంది. లాక్‌డౌన్ కాలంలో ఇంటి పనుల్లో ఆడవారికి సాయం చేయాలని 'అర్జున్ రెడ్డి' చిత్ర దర్శకుడు సందీప్ ఈ చాలెంజ్‌ను ప్రారంభించారు. టాలీవుడ్ అగ్ర కథానాయకులు చిరంజీవి, వెంకటేష్, ఎన్టీఆర్ , రామ్‌చరణ్, కొరటాల శివ, రాజమళి, కీరవాణి, విజయ్ దేవరకొండ వంటి వారు ఈ ఛాలెంజ్ ను విజయవంతంగా పూర్తి చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఈ ఛాలెంజ్‌ను టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్ పూర్తి చేశాడు. అందుకు సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఈ వీడియోలో.. శ్రీరామ్ వ్యవసాయ పనులు చేయడంతో పాటు పశువులకు దాణా వేశారు. కర్రల మోపులను వేసుకుని ట్రాక్టర్‌ను నడిపారు. 'నాన్నకి ఇష్టమైన, నాకు అందుబాటులో ఉన్న వ్యవసాయ పనులు చేశాను. మీరు కూడా మీకు అందుబాటులో వున్న పనులు చేస్తారని ఆశిస్తున్నాను'' అంటూ ట్వీట్ చేశారు. ఈ ఛాలెంజ్‌కు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్, జయదేవ్ గల్లా, కె.రామ్ మోహన్ నాయుడు, మోహన్ బాబు, ఎన్.శంకర్, శ్యామ్ బాబులను నామినేట్ చేశారు.