పరిటాల ఫ్యామిలీకి ఊహించని బిగ్ షాక్..!
By Newsmeter.Network Published on 25 Dec 2019 8:20 AM ISTనసనకోట ముత్యాలమ్మ ఆలయం. పూజా, నైవేధ్య కార్యక్రమాలతో శోభాయమానాన్ని సంతరించుకున్న ఈ ఆలయం అనంతపురం జిల్లా రామగిరి మండల పరిధిలో ఉంది. ఈ ఆలయంలోని ముత్యాలమ్మ వారి దర్శనార్ధం జిల్లా వాసులే కాకుండా కర్ణాటక నుంచి వచ్చిపోతుంటారు. ఈ ఆలయం చుట్టూరా పరిటాల కుటుంబానికి చెందిన భూములు కూడా ఉన్నాయి.
భక్తులతో నిత్యం రద్దీని తలపించే ఈ ఆలయ వార్షిక ఆదాయం కోట్లలోనే ఉంటుంది. 27 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయ పాలక బాధ్యతలు నాటి నుంచి నేటి వరకు పరిటాల కుటుంబ సభ్యుల చేతిలో ఉంటూ వచ్చాయి. మాజీ మంత్రి పరిటాల సునీత తండ్రి ధర్మవరపు కొండయ్య ఆలయ చైర్మన్‌గా, పరిటాల కుటుంబ సభ్యులతోపాటు, అనుచరులతో ఏర్పాటైన కమిటీ ఆలయ పాలక వ్యవహారాలను చూసుకుంటూ వచ్చింది.
పురాతన దేవాలయంగా పేరు గడించిన నసనకోట ముత్యాలమ్మ ఆలయానికి ఆదాయంగా కోట్లాది రూపాయలు వస్తుంటాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు కానుకలుగా బంగారు, వెండిని సమర్పిస్తుంటారు. ఇలా భారీ మెత్తంలో నిధులు, కానుకలతోపాటు ఆలయ పరిధిలో పార్కింగ్ ఫీజు, కొబ్బరి కాయల అమ్మకం, మద్యం అమ్మకాలతో మరిన్ని నిధులు చేకూరుతుంటాయి. మరికొన్ని నిధులను విరాళాల రూపంలో ఆలయ కమిటీ సేకరిస్తుంది.
ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 27 ఏళ్లుగా పరిటాల కుటుంబం చేతుల్లోనే ఈ ఆలయం ఉందని, భారీ మొత్తంలో సమకూరే నిధులను, వెండి, బంగారు కానుకలను వారు పక్కదారి పట్టిస్తున్నారంటూ చాలా కాలం నుంచే విమర్శిస్తూ వస్తున్నారు. ఆఖరకు దేవాలయ పరిసర ప్రాంతాల్లోని షాపులకు ఎటువంటి వేలంపాట నిర్వహించకుండా వారి అనుచరులకే కట్టబెడుతున్నారంటూ తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి చెప్పుకొచ్చారు.
ఎటువంటి లెక్కా.. పక్కా లేకుండా ఆలయ నిధులను దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి జగన్ సర్కార్‌కు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా పరిటాల కుటుంబ సభ్యులు, అనుచరులతో ఏర్పాటైన పాలక కమిటీని రద్దు చేసి ఆలయాన్ని ప్రభుత్వం స్వాధీనపరుచుకోవాలంటూ తోపుదుర్తి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
జగన్ సర్కార్ ఆదేశాలు
ప్రకాష్‌రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాలను నిశితంగా పరిశీలించిన జగన్ సర్కార్ నసనకోట ముత్యాలమ్మ ఆలయాన్ని స్వాధీన పరుచుకోవాల్సిందిగా దేవాదాయశాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆలయ ప్రయివేటు కమిటీని రద్దు చేసిన దేవాదాయశాఖ ఈవోను నియమించింది. ప్రభుత్వ పరంగా పాలక కమిటీని అతి త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఆలయంలోని ప్రభుత్వ సిబ్బంది విధులకు ఆటంకం, దాడులు జరగకుండా పర్యవేక్షించేందుకు పోలీసు సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు.
అలాగే, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్న ఆలయ నిధుల దుర్వినియోగం అంశాన్ని దేవాదాయశాఖ ప్రధానంగా ప్రస్థావించింది. గత 27 ఏళ్లుగా నసనకోట ముత్యాలమ్మ ఆలయ నిర్వహణ బాధ్యతలను చూస్తున్న పరిటాల కుటుంబ సభ్యులపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఆలయ లెక్కలను చెప్పాల్సిందిగా దేవాదాయశాఖ ఆదేశించింది. బంగారం, వెండి, విరాళాలు, కానుకల వివరాల అకౌంట్స్‌ను తమకు స్వాధీన పరచాలని నోటీసులు కూడా జారీ చేసింది. ఏదేమైనా దేవాదాయశాఖ నిర్ణయంతో 27 ఏళ్ల తరువాత నసనకోట ముత్యాలమ్మ ఆలయంపై పరిటాల కుటుంబం ఆధిపత్యం తొలగిపోయినట్టు అంతా భావిస్తున్నారు.