Fact Check : పార్క్ లో దెయ్యాలు జిమ్ చేస్తున్నాయా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Jun 2020 4:37 AM GMTఅది పార్క్ లోని ఒక అవుట్ డోర్ జిమ్, ఎవరూ లేరు.. చుట్టూ అంతా చీకటి. అంతా నిశ్శబ్దం.. కానీ ఆ జిమ్ పరికరాలు వాటికవే ఊగుతున్నాయి. ఎవరి ప్రమేయం లేకుండానే ఇదంతా జరిగిపోతోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలా జిమ్ పరికరాలు వాటంతట అవే ఊగిపోడాన్ని పలువురు వీడియోలు తీయడం మొదలుపెట్టారు. పోలీసులు కూడా దాన్ని వీడియో తీశారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న ఈ వీడియోను కొందరు షాక్ కు గురయ్యారు.
మరికొందరేమో దెయ్యాలే ఇలా చేస్తున్నాయి అంటూ.. మూఢనమ్మకాలకు లింక్ పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేయడం మొదలుపెట్టారు.
పార్క్ లోని జిమ్ పరికరాలు ఎవరూ లేకుండానే ఊగిపోతూ ఉన్నాయంటూ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడం మొదలుపెట్టారు.
ఈ ఘటన న్యూ ఢిల్లీ రోహిణి లోని జపనీస్ పార్క్ లో చోటుచేసుకుంది అని షేర్ చేశారు.
మరికొందరేమో ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. మాకు వాట్సప్ ద్వారా వీడియోను అందింది అంటూ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
దీంతో ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుందా అన్న క్లారిటీ కూడా లేకుండా చాలా మాది సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడం మొదలుపెట్టారు.
నిజ నిర్ధారణ:
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నట్లుగా దెయ్యాలు, భూతాలు అన్నది 'పచ్చి అబద్దం'
ఈ ఘటన న్యూ ఢిల్లీలో చోటుచేసుకోలేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీలో చోటుచేసుకుంది. ఝాన్సీ పోలీసులు ఈ ఘటనపై ఇన్వెస్టిగేషన్ ను పూర్తీ చేశారు.
ఈ వీడియోకు సంబంధించిన చిన్న క్లిప్ ను మాత్రమే షేర్ చేయడం వలన ఎన్నో అనుమానాలు, భయాలు ఉత్పన్నమవుతున్నాయి. కానీ పూర్తీ వీడియోను చూస్తే పోలీసులు ఆ జిమ్ ఎక్విప్మెంట్ ను అలా ముట్టుకోగానే కదలడం మొదలైంది. అందుకు కారణం 'గ్రీజ్' ఎక్కువగా పూయడమే..! కందెన ఎక్కువగా ఉండడంతో కేవలం అలా ముట్టుకోగానే అది తనంతట తానే ఊగడం చూడొచ్చు.
పోలీసులు మాత్రమే కాకుండా స్థానికులు కూడా ఆ ఓపెన్ జిమ్ పరికరాల దగ్గరకు వెళ్లారు. పూర్తీ వీడియోలో నుండి కేవలం కొంచెం మాత్రమే ఎడిట్ చేసి.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పూర్తీ వీడియోను చూడని వ్యక్తులు 'జిమ్ చేస్తున్న దయ్యం', 'ఫిట్నెస్ మీద దృష్టి పెట్టిన దెయ్యాలు'.. ఇది చూసి పోలీసులు కూడా షాక్ అయ్యారు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని పోలీసులు తెలిపారు.
అలా ముట్టుకోగానే ఊగిపోతూ ఉన్న జిమ్ ఎక్విప్మెంట్ కు సంబంధించిన పూర్తీ వివరణ ఇచ్చిన వీడియోను ఝాన్సీ పోలీసులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఆ పార్కులో దెయ్యాలు లేవని.. దెయ్యం వచ్చి జిమ్ కూడా చేయడం లేదని పోలీసులు స్పష్టతను ఇచ్చారు. అలాగే సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలను పోస్ట్ చేసే వారికి వార్నింగ్ కూడా ఇచ్చారు.
కొందరు వ్యక్తులు కావాలనే వీడియోను ఎడిట్ చేసి.. జనాల్లో భయాన్ని సృష్టించాలని అనుకుంటున్నారని.. అలాంటి వ్యక్తులు పోలీసులు లాకప్ లోకి త్వరలోనే వస్తారని అడిషనల్ ఎస్పీ రాహుల్ శ్రీవాస్తవ తెలిపారు.
ఓపెన్ జిమ్ లు ఎలా పనిచేస్తాయి అంటూ వివరణ ఇచ్చే కొన్ని యుట్యూబ్ వీడియోలు చూడొచ్చు. వీటికి దెయ్యాలకు ఎటువంటి సంబంధం లేదని వివరించారు.
పార్క్ లో దెయ్యాలు జిమ్ చేస్తున్నాయంటూ వైరల్ అవుతున్న వీడియో 'పచ్చి అబద్ధం'.