పంతంగి టోల్‌ప్లాజాకు సంక్రాంతి తాకిడి..!

By అంజి  Published on  11 Jan 2020 2:15 PM GMT
పంతంగి టోల్‌ప్లాజాకు సంక్రాంతి తాకిడి..!

యాదాద్రి భువనగిరి: చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. హైవేపై 2 కిమీ మేర వాహనాలు నిలిచిపోయాయి. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో నగరవాసులు స్వస్థలాలకు వెళ్తున్నారు. దీంతో విజయవాడ వైపు వెళ్లే రహదారిపై వాహనాలు బారులు తీరాయి. అదనపు సిబ్బందితో వాహనదారుల నుంచి టోల్‌ వసూలు చేస్తున్నారు. పండుగకు పెద్ద ఎత్తున నగరవాసులు తమ సొంతూళ్లకు బయల్దేరారు. వాహనాలు సాఫీగా వెళ్లేందుకు టోల్‌ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన ఫాస్టాగ్‌ లైన్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వాహనాలు టోల్‌ప్లాజా వద్ద కిక్కిరిసిపోయాయి.

భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంగరంగ వైభవంగా సొంత గ్రామాల్లో పండుగ జరుపుకునేందుకు వెళ్తున్న ప్రజలకు టోల్‌గేట్ల వద్ద ఇబ్బందులు తప్పడం లేదు. ఉద్యోగం నిమిత్తం వలస వచ్చిన వారంతా సంక్రాంతి పండుగకు ఇంటికి వెళ్తున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ, ఏపీ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నాయి. ఏపీ ఆర్టీసీ హైదరాబాద్‌ నుంచి 431 ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతోంది. డిమాండ్‌కు తగ్గట్టుగా సర్వీసులను పెంచుతామని కూడా ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. అత్యధికంగా మార్కాపురం డిపోకు 77 బస్సులు, అద్దంకి డిపోకు 41 బస్సులను నడుపుతున్నారు.

Next Story
Share it