ఆ ఏనుగు తిన్నది ఫైనాఫిల్ కాదట..
By తోట వంశీ కుమార్ Published on 6 Jun 2020 9:24 AM GMTకేరళలోని పాలక్కడ్ జిల్లాలో గర్భంతో ఉన్న ఓ ఏనుగు పేలుడు పదార్థాలతో కూడిన పైనాపిల్ తినడం వల్ల మృతి చెందిందన్న వార్త దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశ వ్యాప్తంగా ఏనుగు మృతికి మనుషులే కారణమయ్యారన్న దానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమయింది. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ ఆఖరికి.. టాటా సంస్థల అధినేత రతన్ టాటా కూడా ఈ విషయంపై స్పందించారంటే.. అది ఎంత దీనస్థితిలో చనిపోయి ఉంటుందో అర్థం చేసుకోవాలి. సమాజంలో మానవత్వం చనిపోయిందంటూ సోషల్ మీడియాలో ఏనుగు, దాని పిల్ల మాటలతో కూడిన మీమ్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి.
ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఓ నిందుతడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాగా.. ఇన్ని రోజులు ఏనుగు చనిపోవడానికి కారణం పేలుడు పదార్థాలు నింపిన ఫైనాఫిల్ తినడం వల్లనేనని అందరూ అనుకుంటుండగా.. తాజాగా మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. పేలుడు పదార్థాలతో కూడిన కొబ్బరి కాయ తినడంతో ఏనుగు మరణించిందని అటవీ శాఖ అధికారి వెల్లడించారు. నోరు తీవ్రంగా గాయపడడంతో రోజుల తరబడి ఆహారం, నీరు కూడా తీసుకోలేని స్థితిలో పాలక్కాడ్‌లోని వెల్లియార్ నదిలో ఆ గజరాజు ప్రాణాలు విడించిందని తెలిపారు. సుమారు 20 రోజులకు పైగా ఆహారాన్ని తీసుకుని ఉండదని అధికారులు అంటున్నారు.
విచారణలో భాగంగా అధికారులు నిందితుడిని పేలుడు పదార్థాలు తయారు చేసే ప్రాంతానికి తీసుకెళ్లారు. ఇక్కడ మరో ఇద్దరితో కలిసి ఓ షెడ్‌లో పేలుడు పదార్థాలను తయారు చేశాడని తమ దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపారు. కాగా.. నిందితుడి పేరు విల్సన్‌గా, ఇతడు చెట్ల నుంచి రబ్బరు తీసేవాడుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కేసులో మిగతా ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు.
అడవి పందుల నుంచి తమ పంటలను రక్షించుకునేందుకు స్థానికులు టపాకాయలు తయారు చేసి పండ్లు, జంతువుల కొవ్వులో నింపి ఉచ్చులుగా ఉంచుతారు. ఈ క్రమంలోనే ఏనుగు కొబ్బరికాయను తినడం వల్లే నోటికి తీవ్ర గాయాలై మరణించినట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు.