పాకిస్తానీ చెల్లి.. ఇండియా అన్న.. ఒక ఐడియా ఇద్దర్నీ కలిపింది.!
By అంజి Published on 16 Dec 2019 7:40 AM GMTఒకరు సరిహద్దుకు ఇటు వైపు. ఇంకొకరు ముళ్ల కంచెకి అటు వైపు. అతను ఇండియన్. ఆమె పాకిస్తానీ.. కానీ హైదరాబాద్‌లో వాష్ అప్ పేరిట లాండ్రీ సర్వీసు నడిపించే 27 ఏళ్ల ధీరజ్ బలుసాని పాకిస్తాన్ లోని ఫైసలాబాద్ లో ఉండే షిఫా అన్వర్ అనే 22 ఏళ్ల అమ్మాయికి అన్నయ్యాడు. ఆమె ఆర్థిక ఆదాయానికి బాటలు వేశాడు. ఆమె వ్యాపారానికి కిటుకులు చెప్పాడు. ఈ రోజు అల్లా తరువాత ధీరజ్ అనే అని షిఫా అనుకుంటోంది.
జూన్ 2018 లో ఏదో ఒక స్టార్టప్ ను స్థాపించి, ఆర్ధికాదాయాన్ని సాధించాలని షిఫా అనుకుంది. అనుకున్నదే తడవుగా ఇంటర్నెట్ లో బిజినెస్ ఐడియాల కోసం అన్వేషణ ప్రారంభించింది. ఆ సమయంలోనే ధీరజ్ బలుసాని చేస్తున్న లాండ్రీ సర్వీస్ ఆమెను ఆకట్టుకుంది. ఆమె సోషల్ మీడియా ప్లాట్ ఫారాల ద్వారా ధీరజ్ ను సంప్రదించింది. అప్పటికే ధీరజ్ 2016 నుంచి వాష్ అప్ పేరట లాండ్రీ సర్వీసును నడిపిస్తున్నాడు. నిత్యం బిజీగా ఉండే ఐటీ ఉద్యోగుల దుస్తులను ఉతికి శుభ్రం చేసే పనిని ఆయన చేస్తున్నాడు. నెలకు యాభై వేల దుస్తులకు పైగా ఆయన వాష్ చేస్తున్నాడు. అతని ప్రేరణతో షిఫా వాష్ హబ్ ను ఫిబ్రవరి 2019 లో ఏర్పాటు చేసింది. ఫసలాబాద్ నగరంలోని తొలి వాషింగ్ హబ్ ఆమెదే. నెలకు దాదాపు పదివేల దుస్తులను ఆమె వాష్ చేస్తోంది. వినియోగదారులు వాష్ హబ్ యాప్ లో రిజిస్టర్ అయి ఆర్డర్ ప్లేస్ చేయవచ్చు. ఆర్డర్ల ఆధారంగా తన సిబ్బందిని పంపించి, వాషింగ్ కు బట్టల్ని తెప్పిస్తుంది. పని పూర్తయ్యాక డెలివరీ చేస్తుంది. ఆమె ఇన్నొవేటివ్ ఐడియా పాకిస్తాన్ లో స్టార్టప్ పోటీల్లో తొలి స్థానంలో నిలిచింది. ఇప్పుడు సోదరుడు అమీర్ మహ్మద్ కూడా ఈ వ్యాపారంలో ఆమెకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఇదంతా ధీరజ్ ఇచ్చిన ప్రోత్సాహం వల్లే సాధ్యమైందని ఆమె చెబుతోంది.
అయితే మొదట్లో ఆమె కుటుంబం బట్టలుతికే బిజినెస్ ను ఆమోదించలేదు. నువ్విప్పుడు ధోబీగా పనిచేస్తావా అని ఆక్షేపించారు. కానీ వారిని ఆమె ఎలాగోలా ఒప్పించింది. మొదట్లో ధీరజ్ పాకిస్తానీ అమ్మాయిని నమ్మడానికి సందేహించాడు. కానీ తరువాత ఆమె నిజంగానే స్టార్టప్ ను స్టార్ట్ చేయాలనుకుంటుందన్న విషయాన్ని గుర్తించాడు. ఆమెకు సాయం చేయడం, కిటుకులు చెప్పడం మొదలుపెట్టాడు. మొత్తం మీద ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందంటారు. ఒక విలక్షణమైన ఐడియా ఎన్నడూ కలుసుకోని దాయాది దేశాల అన్నా చెల్లెళ్లను కలవకుండానే కలిపేస్తోంది. వాట్ యాన్ ఐడియా సర్జీ!!!