ఇమ్రాన్ ప్రభుత్వానికి షాకిచ్చిన పాక్ ప్రజలు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 2 Nov 2019 6:31 PM ISTకశ్మీర్ అంశంపై పాకిస్థాన్‌కు దిమ్మ తిరిగిపోయే షాక్ తగిలింది. సొంత దేశ ప్రజలే పాక్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. కశ్మీర్ అంశం తమకు ఏమాత్రం ముఖ్యం కాదని పాకిస్థానీలు తేల్చి చెప్పారు. ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, అవినీతే తమకు ముఖ్యమైన అంశాలని స్పష్టం చేశారు. తాగునీటి కొరత, డెంగ్యూ విజృంభణ, రాజకీయ అస్థిరతలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా దేశ ఆర్థిక సంక్షోభం వణుకుపుట్టిస్తోందని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడ్డారు.
పాకిస్థాన్ పాలకులు దశాబ్దాలుగా కశ్మీర్ అంశాన్ని స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారు. కశ్మీర్ వ్యవహారాన్ని బూచీగా చూపెట్టి స్వదేశీ సమస్యలపై ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు. కశ్మీర్ చుట్టూ చర్చ కొనసాగిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కూడా అదే చేస్తోంది. ఆర్టికల్-370 రద్దు తర్వాత ఇంటా బయటా నానా యాగీ చేసింది. ప్రపంచదేశాలను అర్ధించడంతో పాటు ఐక్యరా జ్యసమితి వేదికగా కళ్లబొల్లి కబుర్లు చెప్పింది. కశ్మీర్ అంశాన్ని తెరపైకి తెచ్చి అసలు సమస్య నుంచి తప్పించుకోవాలని ట్రై చేసింది. కానీ, ప్రజల ముందు ఆ పప్పులేమీ ఉడకలేదు. తమకేది ముఖ్యమో ప్రజలే తేల్చి చెప్పారు.
కశ్మీర్ కంటే కూడా తమకు సొంత దేశ సమస్యలే ప్రధానమని ప్రజలు కుండబద్దలు కొట్టారు. కశ్మీర్‌పై పాక్ ప్రజల మనసులో ఏముందీ..? స్వదేశీ సమస్యలపై ప్రజలు ఏమనుకుంటున్నారు..? కశ్మీర్ విషయానికి వాళ్లు ఇస్తున్న ప్రయారిటీ ఎంత...? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి గాలప్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రయ త్నించింది. వివిధ వర్గాల ప్రజలతో సర్వే నిర్వహించి ఓ నివేదిక రూపొందించింది. ఆ రిపోర్ట్ ప్రకారం... పాక్ ప్రజల ను ఎక్కువగా ప్రభావితం చేస్తోంది కశ్మీర్ అంశం కాదు. ఆర్థిక సంక్షోభం తమకు వణుకుపుట్టిస్తోందని సర్వేలో పాల్గొన్న వారిలో 53 శాతం మంది పేర్కొన్నారు. కశ్మీర్ అసలు సమస్య కాదని, విపరీతంగా పెరిగిన నిత్యావ సర వస్తువుల ధరలు, దేశ ఆర్థిక వ్యవస్థే తమని తీవ్రంగా కలచివేస్తున్నాయని చెప్పారు. నిరుద్యోగంపై 23శాతం మంది ఆందోళన వ్యక్తం చేయగా, అవినీతిపై-4శాతం, తాగునీటి సమస్యపై-4శాతం ప్రజలు ఆందోళన తెలిపారు. 8 శాతం మంది మాత్ర మే కశ్మీర్ అంశానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు.
కశ్మీర్ అంశంపై రాద్ధాంతం చేస్తున్న ఇమ్రాన్ ప్రభుత్వానికి తాజా సర్వే చెంపపెట్టులా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పాక్ పరిస్థితి అత్యంత దారుణ స్థితికి చేరుకుందని, సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ హెచ్చరించింది. పాక్ ఖజానాలో 8 బిలియన్ డాలర్ల నిధులు మాత్రమే ఉన్నాయి. అవి 2 నెలల దిగుమతులకు మాత్రమే సరిపోతాయి. ఈ నేపథ్యంలో ఐఎంఎఫ్ 6 బిలియన్ డాలర్ల బెయిల్ ఔట్ ప్యాకేజీతో పాక్‌కు అండగా నిలిచింది. చైనా, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈలు కూడా పాకిస్థాన్ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆర్థిక సాయానికి ముందుకు వచ్చాయి