అనుష్క శ‌ర్మ ‌'పాతాళ్‌ లోక్'‌ వెబ్‌ సిరీస్‌పై ఫిర్యాదు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 May 2020 5:41 AM GMT
అనుష్క శ‌ర్మ ‌పాతాళ్‌ లోక్‌ వెబ్‌ సిరీస్‌పై ఫిర్యాదు

టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ స‌తీమ‌ణి, బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శర్మపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు అందింది. వివ‌రాల్లోకెళితే.. అమెజాన్ ప్రైమ్‌లో తాజాగా పాతాళ్‌ లోక్‌ వెబ్‌ సిరీస్ అనే క్రైమ్‌ థ్రిల్లర్‌ వెబ్ సిరీస్ విడుద‌లైంది. ఈ వెబ్ సిరీస్‌కు అనుష్క శ‌ర్మ నిర్మాత‌. అవినాష్‌– ప్రొసిత్ రాయ్‌లు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అయితే ఈ వెబ్ సిరీస్‌లో తమను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ.. ది అరుణాచల్‌ ప్రదేశ్‌ గూర్ఖా యూత్‌ అసోసియేషన్.. జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేసింది.



ఈ విషయమై భారతీయ గూర్ఖా యువ పరిసంఘ్‌ అధ్యక్షుడు నందా కిరాటి దేవన్‌ మాట్లాడుతూ.. సమాజంలో తమ ప్రతిష్టను దిగజార్చేలా.. మ‌మ్మ‌ల్ని కించ‌ప‌రిచే సన్నివేశాలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ సన్నివేశాలు వ‌స్తున్న‌ప్పుడు డైలాగ్స్‌ను మ్యూట్‌లో పెట్టి.. సబ్‌టైటిల్స్‌లో మార్పులు చేసి మ‌ర‌లా అప్‌లోడ్‌ చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయ‌ని యెడ‌ల‌ చట్టాన్ని ఆశ్ర‌యిస్తాన‌ని హెచ్చ‌రించారు.

ఇదిలావుంటే.. పాతాళ్‌ లోక్ వెబ్‌సిరీస్‌లోని సెకండ్‌ ఎపిసోడ్‌లో.. మేఘాలయలో ఖాసీ తెగకు చెందిన ఓ యువతి... పాతాళ్‌ లోక్‌లో మహిళను అసభ్యంగా దూషిస్తూ, అభ్యంతరకర పదజాలాన్ని ఉపయోగించారని ఆరోపిస్తూ.. వాటిని తొలగించాలని కోరుతూ ఆన్‌లైన్‌లో పిటిషన్‌ దాఖలు చేసింది. 9 ఎపిసోడ్లుగా అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లైన‌ ఈ వెబ్ సిరీస్‌కు సుదీప్‌ శర్మ ర‌చ‌యిత‌. స‌యాజంలో చీక‌టి కోణాల‌ను అవిష్క‌రించేలా ఉందంటూ.. ఇప్ప‌టికే ఈ వెబ్ సిరీస్‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఈ ఫిర్యాదు నేఫ‌థ్యంలో ఎటువంటి మార్పులు, చేర్పులు ఉండ‌నున్నాయ‌నేది ఆస‌క్తి క‌లిగించే అంశం.

Next Story