మా ప్రభుత్వం అబద్ధాలు చెబుతోంది.. 20 రెట్లు ఎక్కువగా చనిపోయారు..!

By అంజి  Published on  30 March 2020 10:12 AM GMT
మా ప్రభుత్వం అబద్ధాలు చెబుతోంది.. 20 రెట్లు ఎక్కువగా చనిపోయారు..!

కరోనా మహమ్మారి బారిన పడిన తమ దేశస్థులు బాగా కోలుకుంటున్నారని చైనా అధికారులు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే..! చనిపోయిన వారి సంఖ్యను కూడా చైనా ప్రకటించింది. కానీ అక్కడ చనిపోయిన వారి సంఖ్య 20 రెట్లు ఎక్కువగా ఉందని.. ప్రభుత్వం చెప్పిన సంఖ్యకు.. తమ దేశంలో చనిపోయిన వారి సంఖ్యకు చాలా వ్యత్యాసం ఉందని అంటున్నారు చైనా ప్రజలు. చైనా ప్రస్తుతం ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబడ్డ తరుణంలో ఇలా అబద్దాలు కూడా చెబుతోందని తెలియడం అందరినీ షాక్ కు గురిచేసింది.

వుహాన్ కు చెందిన కొందరు ప్రజలు రేడియో ఫ్రీ ఏషియాతో మాట్లాడుతూ శవాలను విపరీతంగా కాలుస్తున్నారని.. అది కూడా 24 గంటలూ ఆ పని జరుగుతూనే ఉందని.. కానీ కొందరే చనిపోయారని ఎలా నమ్మగలరని ప్రజలు ప్రశ్నించారు. చితాభస్మాలను పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులకు ఇస్తున్నారని అన్నారు.

హుబె ప్రావిన్స్ లో 3000 మంది చనిపోయారని అధికారిక లెక్కలు చెబుతున్నా(సంఖ్యలో ఎప్పటికప్పుడు మార్పు ఉండే అవకాశం ఉంది).. స్థానికులు మాత్రం 42000 నుండి 47000 మంది దాకా చనిపోయి ఉంటారని అంటున్నారు. వుహాన్ లోని ఏడు శ్మశాన వాటికల్లో చితా భస్మాన్ని పంపిస్తూ ఉన్నారని. రోజుకి 3500కి పైగా చితాభస్మం ఉన్న పాత్రలను బంధువులకు అప్పగిస్తూ ఉన్నారు. అక్కడి ఎలెక్ట్రికల్ క్రిమేషన్ సెంటర్ల కెపాసిటీని అంచనా వేసినా కూడా 40000 మందికి పైగా మరణించి ఉంటారని అంటున్నారు. అధికారులు నిదానంగా నిజమైన లెక్కలను విడుదల చేసే అవకాశం ఉందని.. ప్రజలు కూడా నిజాన్ని అంగీకరించే సమయం దగ్గరకు వచ్చిందని అంటున్నారు. వుహాన్ ప్రజలు మాత్రం 40000 మందికి పైగా మరణించారని నమ్ముతున్నారని ఓ వ్యక్తి మీడియాకు తెలిపారు. కొందరైతే ఇళ్లల్లోనే చనిపోయారని.. వారిలో కరోనా వైరస్ ఉందని చెక్ చేసిన వాళ్ళు లేరని.. వారి సంఖ్యను ప్రభుత్వాధికారులు తమ లిస్టులోకి చేర్చలేదని స్థానికులు చెబుతున్నారు.

సోషల్ మీడియాలో ఫొటోలు..

శ్మశానవాటికల్లో రోజుకు ఎంత మందికి దహనసంస్కారాలు జరుగుతున్నాయో ఆ డేటాను అధికారులకు రోజుకు రెండు సార్లు పంపుతున్నారట. కేవలం అక్కడి అధికారులకు మాత్రమే డేటా అందుతోందని.. దాన్ని వాళ్ళు బయటపెట్టడం లేదని తెలుస్తోంది. ఎప్పుడైతే చితాభస్మాలను ఉంచిన పాత్రలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయో.. ఇప్పుడు మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.

Also Read: ప్రపంచాన్నే అతలాకుతలం చేసిన చైనా.. చనిపోయిన వారి సంఖ్యను దాచిందా..?

హుబె ప్రావిన్స్ లో రెండు నెలల లాక్ డౌన్ అనంతరం 5 కోట్ల మంది ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ప్రజా రవాణా సేవలు సైతం ప్రారంభమయ్యాయి. గ్రీన్ హెల్త్ సర్టిఫికెట్ వున్న వారిని 25వ తేదీ నుంచి రవాణా సౌకర్యాలను వినియోగించుకునేందుకు అనుమతిస్తున్నారు. అసలు నిజాలు అక్కడి ప్రజలకైనా తెలుసో లేదో.. లేకపోతే ప్రజలను కూడా కట్టడి చేయాలని అక్కడి అధికారులు భావిస్తూ ఉన్నారేమో..! చైనాలో మృతుల సంఖ్య 3,000 దాటిందని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించగా, ఇక్కడి మరణాల సంఖ్య 42 వేలకు పైనే ఉండచ్చని వుహాన్ స్థానిక ప్రజలు నమ్ముతున్నారు. చైనా చెబుతున్న మృతుల్లో 3,182 మంది హుబె ప్రావిన్స్ కు చెందిన వారే.

Next Story