ప్రపంచాన్నే అతలాకుతలం చేసిన చైనా.. చనిపోయిన వారి సంఖ్యను దాచిందా..?

By అంజి  Published on  30 March 2020 7:42 AM GMT
ప్రపంచాన్నే అతలాకుతలం చేసిన చైనా.. చనిపోయిన వారి సంఖ్యను దాచిందా..?

కరోనా వైరస్ మహమ్మారి.. పుట్టినిల్లు చైనాలోని వుహాన్ ప్రాంతం. అక్కడి నుండి ప్రపంచ దేశాలకు విపరీతంగా పాకిపోయింది. ప్రపంచ దేశాల ముందు చైనా ఇప్పుడు దోషిగా నిలబడింది. చైనాలో కరోనా వైరస్ బారిన పడ్డ వారిలో రికవరీ అవుతున్న వారి సంఖ్య అధికంగా ఉండడం ప్రపంచదేశాలను, ప్రజలను షాక్ కు గురిచేస్తోంది. అంత సులువుగా వారు రికవరీ అవ్వడం ఏంటని.. చైనా ఏదైనా ప్లాన్ చేసిందా అన్న అనుమానాలను రేకెత్తిస్తోంది.

కానీ అక్కడి ప్రభుత్వం చెబుతున్న అఫీషియల్ లెక్కలకు.. ఆ దేశ ప్రజలు, అస్థికలను సంబంధించిన ఫోటోలను చూస్తే మాత్రం పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వైరస్ పుట్టిన వుహాన్ ప్రాంతంలో.. మొదట్లోనే అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుని ఉండి ఉంటే ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని అన్నారు.

డిసెంబర్ లో ఈ వైరస్ ప్రబలడం మొదలైంది. ఆ తర్వాత ఎంతో మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారి అస్థికలను చిన్న పాత్రల్లో ఉంచి వారి బంధువులకు ఇవ్వడం ఈవారం నుండి మొదలుపెట్టారు అక్కడి అధికారులు. కానీ చైనీస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలను చూస్తూ ఉంటే చైనా చెప్పిన చనిపోయిన వారి లెక్కలకు అక్కడ ఉన్న అస్థికల పాత్రలకు చాలా వ్యత్యాసం ఉందట..! చైనీస్ మీడియా ప్రకారం గత బుధవారం, గురువారం నాడు 2500 పాత్రలను ట్రక్కుల్లో తరలించారట. అలాగే 3500 పాత్రలకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. వాటిలో ఎన్నిట్లో చితాభస్మాలు ఉన్నాయో క్లారిటీ లేదని అక్కడి మీడియా తెలిపింది. వుహాన్ లోని అధికారులు కూడా తమ దగ్గర ఎంతమందికి చెందిన చితాభస్మాలు ఉన్నాయో సరైన డేటా లేదంటూ తప్పించుకున్నారు. తాము కొన్ని గంటల పాటూ ఎదురుచూసి తమ కుటుంబ సభ్యుల చితాభస్మాన్ని తీసుకుని వచ్చామని కొందరు మీడియాకు తెలిపారు.

లెక్కకు మించి చనిపోయారా..

చైనీస్ ప్రభుత్వ డేటా ప్రకారం వుహాన్ లో 2,535 మంది మరణించారు. వైరస్ ప్రభావం చాలా వరకూ తగ్గడంతో.. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ ఎత్తివేసినట్లు అధికారులు చెప్పారు. చైనాకు చెందిన మెడికల్ టీమ్ లను ఇతర దేశాలకు పంపించారు.. మెడికల్ ఎక్విప్మెంట్ ను కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేశారు.

కానీ చైనా మాత్రం చాలా విషయాలను దాస్తున్నట్లు అనుమానులు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా అక్కడి అధికారులు వైరస్ ప్రారంభ దశలో ఉన్నప్పుడే సరైన చర్యలు తీసుకోలేదని.. స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆ అధికారులపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. చాలా మందికి కరోనా లక్షణాలు ఉన్నా కూడా కొందరిని అఫీషియల్ లిస్టు లోకి చేర్చలేదని అక్కడి మీడియా సంచలన విషయాన్ని బయటపెట్టింది. ఇతర కారణాల వలన ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారిని అధికారులు కనీసం పట్టించుకోలేదని అన్నారు. 2019లో చివరి నాలుగు నెలల్లో వుహాన్ లో 56007 మంది చనిపోయినట్లు అఫీషియల్ గా అక్కడి అధికారులు వెల్లడించిన డేటాలో ఉంది. 2018, 2017 ల్లో పోలిస్తే ఆ సమయంలో చనిపోయిన వారి సంఖ్య అధికంగానే ఉంది.

తుది వీడ్కోలు చెప్పడంలోనూ ఆంక్షలే:

తమ ఆప్తులకు తుది వీడ్కోలు తెలపడంలోనూ అక్కడి అధికారులు ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. సమాధిని శుభ్రపరచడం లాంటి పనులను ఏప్రిల్ 30వ తేదీ వరకూ ఆపాలని ఆంక్షలు జారీ చేశారు. ఏప్రిల్ 4న చింగ్ మింగ్ ఫెస్టివల్ ను కూడా రద్దు చేశారు. వుహాన్ లోనే కాకుండా మిగిలిన ప్రావిన్స్ లలో కూడా ఇలాంటి ఆంక్షలనే జారీ చేశారు. చితాభస్మాలను తీసుకుని రావడానికి.. తుది వీడ్కోలు పలకడానికి కూడా సరైన అవకాశం లేదని.. పలువురు ఆన్ లైన్ లో ఆరోపించారు.

Next Story