ఓయూ వద్ద తీవ్ర ఉద్రిక్తత

By సుభాష్  Published on  24 May 2020 7:23 AM GMT
ఓయూ వద్ద తీవ్ర ఉద్రిక్తత

ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన భూములు అక్రమణకు గురవుతున్నాయని, భూములను పరిశీలించేందుకు వెళ్తున్న కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. భూములను పరిశీలించేందుకు కాంగ్రెస్‌ నేతలు నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టివిక్రమార్క, వి.హెచ్, సంపత్ కుమార్, వంశీచంద్ రెడ్డి వెళ్లగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. దీంతో కొంత సేపు తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతూ.. ఇటీవల టీఆర్‌ ఎస్‌ కార్పొరేటర్‌ భర్త మాణికేశ్వర్‌ నగరంలోని ఓయూ సెంటర్‌ ఫర్‌ డివోషనల్‌ స్టడీస్‌కు చెందిన 2వేల గజాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించాడని, ప్రస్తుతం బీజేపీ కేంద్ర ప్రభుత్వ బడా నేతల అండతో 8వేల గజాలకుపైగా కబ్జా చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల అండతో భూకబ్జా దందా నడుస్తోందని, ప్రభుత్వ భూములను కాపాడాల్సిన సర్కార్‌ పెద్దలే.. కబ్జాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు.

ఈ కబ్జా వ్యవహారాన్ని యూనివర్సిటీకి చెందిన విద్యార్థి సంఘాలు, పూర్వ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. కబ్జాదారులకు అండగా ప్రభుత్వం నిలుస్తోందని, కబ్జాని అడ్డుకుంటున్న విద్యార్థులు, అధ్యాపకులపై పోలీసు కేసులు పెడుతున్నారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు.

నాడు తెలంగాణ కోసం పోరాటం చేసినందుకే కేసులు, నేడు తెలంగాణ ఆస్తులు కాపాడుకుంటున్నందుకు కేసులా అంటూ తవ్ర స్థాయిలో మండిపడ్డారు. సామాజిక మధ్యమాల్లో ఈ భూకబ్జాను వ్యతిరేకిస్తున్న అధ్యాపకులకు సైతం సైబర్‌ క్రైమ్‌ నోటీసులు జారీ చేసిందని, కాంగ్రెస్‌ ఈ భూకబ్జా భాగోతాన్ని తీవ్రంగా ఖండిస్తుందన్నారు. న్యాయపరంగా చర్యలు తీసుకొని యూనివర్సిటీకి ప్రహరీగోడ నిర్మించాలని డిమాండ్‌ చేశారు. ఓయూ భూములను కాపాడుకునేందుకకు కాంగ్రెస్‌ పోరాటానికి ఎల్లప్పుడు సిద్ధంగానే ఉందని స్పష్టం చేశారు.

Next Story