కోవిద్-19 పాజిటివ్ కేసులు దేశవ్యాప్తంగా అంతకంతకూ పెరిగిపోతూ ఉన్నాయి. తెలంగాణలో ఈ మధ్యనే టెస్టింగ్ ల సంఖ్యను కూడా బాగా పెంచేశారు. దీంతో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో హైదరాబాద్ గురించి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్ లో పరిస్థితి దారుణంగా ఉందంటూ పలువురు వీడియోలను ప్రచారం చేస్తున్నారు.
ఇక వాట్సప్ లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఉస్మానియా ఆసుపత్రిలోని మార్చురీ వద్ద శవాలు గుట్టలుగా పేర్చి ఉన్నారని.. పరిస్థితి చాలా దారుణంగా తయారైందంటూ వీడియోను వైరల్ చేస్తూ వస్తున్నారు.
ఆసుపత్రి మేనేజ్మెంట్ శవాలను వారి బంధువులకు అప్పగించడంలో విఫలమైందంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. ఆసుపత్రి యాజమాన్యం శవాలను పాతిపెట్టాలని కూడా అనుకోవడం లేదని ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.
నిజ నిర్ధారణ:
హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలోని మార్చురీలో ప్రస్తుత పరిస్థితి ఇదంటూ వైరల్ అవుతున్నది 'తప్పుడు సమాచారమే'
వీడియో మీద ఉన్న లోగో 'IndToday' ను చూసి ఆ యూట్యూబ్ ఛానల్ గురించి తెలుసుకోగా అది హైదరాబాద్ లోకల్ ఛానల్ అని తెలిసింది. వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన ఒరిజినల్ లింక్ ఆ ఛానల్ యూట్యూబ్ పేజీలో చూడొచ్చు. ఆ వీడియో డిసెంబర్ 25, 2013న పోస్టు చేశారు. ‘Unclaimed bodies pile up at OGH mortuary | Hyderabad Osmania General Hospital’ అంటూ వీడియోను పోస్ట్ చేశారు. ఉస్మానియా ఆసుపత్రిలో గుర్తు తెలియని శవాలు ఎక్కువవుతూ ఉన్నాయంటూ అప్పట్లో వీడియోలను పోస్టు చేశారు. ఇప్పుడు ఆ వీడియోను తీసుకుని.. వాటిని ప్రస్తుత పరిస్థితులకు సంబంధం అని చెబుతూ వైరల్ చేస్తున్నారు. రెండు నిమిషాల వీడియోకు కొందరు కొన్ని రకాల వాయిస్ ఓవర్ ఇస్తూ వీడియోను వైరల్ చేశారు.
పర్షియాకు చెందిన వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ 'http://milanvideo.com’ లో కూడా ఈ వీడియోను అప్లోడ్ చేశారు.
కొన్ని వెబ్ సైట్లలో కూడా ఈ వీడియోను షేర్ చేశారు.
http://videonew.ir/v/1364683/
http://appfile.ir/v/471026/
హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలోని మార్చురీలో ప్రస్తుత పరిస్థితి అంటూ చెబుతున్న వీడియోలో తప్పుడు సమాచారాన్ని పొందుపరిచారు. ఈ వీడియో 2013 సంవత్సరానికి చెందినది.