అవయవదాత.. స్ఫూర్తిప్రదాత.. ఏ సమయంలో ఏయే అవయవాలు దానం చేయాలి

By సుభాష్  Published on  25 Jun 2020 2:38 AM GMT
అవయవదాత.. స్ఫూర్తిప్రదాత.. ఏ సమయంలో ఏయే అవయవాలు దానం చేయాలి

మరణించిన ప్రతి వ్యక్తి దహనమో.. లేక ఖననమో చేయడం చేస్తుంటాము. ఇది తరతరాలుగా సంప్రదాయం. అయితే ఇప్పుడున్న కాలంలో కొద్దిగా మార్పు వచ్చింది. అత్యవసర సమయాల్లో అవయవాలు దానం అన్నింటికన్న గొప్పదని భావిస్తున్నారు.

ఒక్కరిగా పుట్టి పదిమందిలో బతికి ఒంటరిగానే పోతాము.. జీవితమంటే ఇదే. అన్నది పాత కాలం నాటి మాట. ఒంటరిగానే పుట్టాము.. దీర్ఘాయుష్షుతో పది మందిలో బతుకుతాం.. మాకు మరణం లేదు.. మా కళ్లు చూస్తున్నాయి... మా గుండె కొట్టుకుంటుంది.. కాలేయం పని చేస్తోంది. ఊపిరితిత్తులు పని చేస్తున్నాయి.. ఇవీ శరీర అవయదాతలు నిరూపిస్తున్న సత్యాలు.

ప్రస్తుతం మన దేశంలో చాలా మందికి రక్తదానం గురించి, నేత్రదానం గురించి మాత్రమే తెలిసి ఉంటుంది. కానీ అతి తక్కువ మందికి మాత్రమే వీటిపై సరైన అవగాహన ఉంది. వీటికి మించిన దానమే అవయవదానము. ఒకప్పుడు అన్నిదానాలకన్నా అన్నదానం మిన్న.. అనేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. అన్నదానానికి మించిన దానం మరొకటి ఉందని గుర్తించుకోవాలి. అదే అవయవదానం. ఇదంతా అత్యధునిక వైద్యం వల్ల మాత్రమే సాధ్యమయ్యే పని. ఇప్పుడిప్పుడు కొందరు అవయవదానం చేయడానికి ముందుకొస్తున్నారు. జూన్‌ 25 ప్రపంచ అవయవదాన మార్పిడి దినోత్సవం జరుపుకొంటున్నారు.

రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తులకు అవయవదానాలను అమర్చి వారి ప్రాణాలను కాపాడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మరణించిన వ్యక్తి జీవితం అక్కడితో ఆగలేదు. మరణించిన వ్యక్తి మరికొంత మందికి ప్రాణమిచ్చి జీవిస్తూనే ఉన్నాడు.

అవయవదానం వల్లనే ప్రాణాలు కాపాడటం సాధ్యం:

ఒకరితో ఎంతో మంది ప్రాణాలను కాపాడటం కేవలం అవయవదాన మార్పిడి వల్లనే సాధ్యమని వైద్యులు చెబుతున్నారు. కళ్లు, మూత్ర పిండాలు, ఊపిరితిత్తులు, చర్మం, ఎముక, గుండె కవాటాలు, కార్నియో, సిరలు ఇలా ఎన్నో అవయవదానాల వల్ల మార్పిడి చేయవచ్చు. బ్రెయిన్‌డెడ్‌ అయ్యేవారి శరీరాలను వెంటనే దానం చేస్తే ఇతరులకు అమర్చవచ్చు. అవయవ మార్పిడితో ఎవ్వరైనా కొత్త జీవితాన్ని తిరిగి పొందే అవకాశం ఉంటుంది. దురదృష్టవశాత్తు ఈ అవయవదాన మార్పిడి సంబంధించి అనేక అపోహాలు, గందరగోళం కారణంగా దాతల సంఖ్య తక్కువ అవుతోంది. ఒక్కదాతతో 8 మంది ప్రాణాలను రక్షించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం 5 లక్షలకుపైగా ప్రజలు వారి ముఖ్య అవయవాల వైఫల్యం కారణంగా మరణిస్తున్నట్లు ఓ నివేదిక ద్వారా తెలిసింది. ఆధునిక వైద్యం ద్వారా ఓ వ్యక్తి శరీర భాగాలను ఇతరులకు అమరిస్తే వారి ప్రాణాన్ని, జీవితాన్ని నిలబెట్టే ఒక అద్భుతమైన అవకాశం దొరుకుతుంది.

ప్రజల్లో చైతన్యం పెరగాలి:

అవయవదానంపై ప్రజల్లో ఇంకా చైతన్యం పెరగాల్సిన అవసరం ఉంది. దేశంలో అవయవదాన మార్పిడిపై ప్రభుత్వాలు పెద్దగా చొరవ చూపడం లేదు. స్వచ్చంధ సంస్థలు, కొంత మంది అభ్యుదయవాదులు మాత్రమే అవయవాలను దానం చేసేందుకు ముందుకొస్తుంటారు. రాష్ట్రాల్లో జీవన్‌ధాన్‌ సంస్థలు ఉన్నా.. అది పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు. ఫలితంగా ఈ అవయవదానాలపై అవగాహన కొరవడింది. మున్ముందు అవయవదానాలు, వాటి మార్పిడిలపై ప్రభుత్వాలు, స్వచ్చంధ సంస్థలు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అప్పుడు అవయవదానం చేసేందుకు ముందుకొస్తుంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

బతికి ఉండగా ఇవ్వగలిగే దానాలు:

- రక్తదానం

- ఎముక మజ్జ

- ఒక మూత్రపిండం

సాధారణ మరణం తర్వాత ఇవ్వగలిగే దానం

-గుండె కవాటాలు

- చర్మం

- ఎముకలు

- సిరలు, ధమనులు

బ్రెయిన్ డెడ్ తర్వాత చేయగలిగే దానాలు:

- ఊపిరితిత్తులు

- మూత్రపిండాలు

- కాలేయం

- చేతులు

- గర్భాశయం

- క్లోమం

- స్వరపేటిక

- ముఖం

- సిరలు, ధమనులు

- కళ్లు

- చెవి మధ్య భాగం

- చర్మం

- నరాలు

- చేతి, కాళ్ల వేళ్లు

ఏయే అవయవం ఎంత సమయంలో దానం చేయాలంటే..

- ఊపిరి తిత్తులు, గుండె 6 గంటలలోపు

- మూత్రపిండాలు 48 గంటల లోపు

- నేత్రాలు 4 గంటలలోపు

- కాలేయం 12 గంటల లోపు

- క్లోమం 24 గంటల లోపు

Next Story