ఆన్‌లైన్ క్లాసుల విషయంలో స్పష్టమైన పాలసీ లేదు.. తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు
By సుభాష్
కరోనా మహమ్మారి వల్ల దేశ వ్యాప్తంగా విద్యార్థులకు చదువు అస్తవ్యస్తంగా మారింది. లాక్‌డౌన్ కారణంగా విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. మళ్లీ ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే కరోనా వ్యాప్తి మాత్రం తగ్గకపోవడంతో ప్రైవేటు పాఠశాలలు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. చిన్న పిల్లలకు కూడా కంప్యూటర్, స్మార్ట్ ఫోన్‌లలో పాఠాలు చెబుతున్నాయి. దీంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నానరు. ఆన్‌లైన్ తరగతుల పేరుతో ప్రైవేటు విద్యాసంస్థలు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో ఆన్‌లైన్ తరగతులను నిషేధించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్‌పై విచారించిన హైకోర్టు.. ఆన్‌లైన్ క్లాసుల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన పాలసీని రూపొందించలేదని వ్యాఖ్యనించింది.
ఆన్‌లైన్ క్లాసుల వల్ల పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని విచారణ సందర్భంగా పిటిషన్ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ల్యాప్‌టాప్, స్మార్ట్ ఫోన్‌లు కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత అందరికి ఉంటుందా..? అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై డీఈవోలు చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాగా, ఆన్‌లైన్ క్లాసులపై ప్రభుత్వం సరైన పాలసీ రూపొందించలేదన్న కోర్టు.. ఎల్లుండి లోగా ఆన్‌లైన్ క్లాసులపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.