హైదరాబాద్‌లో మద్యం డోర్ డెలివరీ అంటూ..
By తోట వంశీ కుమార్ Published on 6 April 2020 10:14 PM ISTకరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో నిత్యావసరాల దుకాణాలు తప్ప అన్ని మూతబడ్డాయి. అందరి సంగతి అలా ఉంచితే.. మద్యం ప్రియులు మాత్రం చుక్క మందు దొరకక అల్లాడిపోతున్నారు. కొన్ని చోట్ల బ్లాక్‌లో బాటిల్‌కి ఎంత రేటైనా ఇచ్చి కొంటున్నారు. అంత రేటు పెట్టి కొనలేని సామాన్యుడు మాత్రం పిచ్చెక్కిపోతున్నారు. ఎప్పుడెప్పుడు వైన్ షాపులు తెరుచుకుంటాయా..? అని ఆశగా ఎదురు చూస్తున్నారు. మందుబాబులను టార్గెట్ చేసిన ఆన్‌లైన్ కేటుగాళ్లు.. ఆన్‌లైన్‌లో బుక్‌చేసుకుంటే.. మందును ఇంటికే పంపిస్తామంటూ మెసేజ్‌లు పెట్టి నిండా ముంచేస్తున్నారు.
హైదరాబాద్‌లోని గౌలిపురాకు చెందిన రాహుల్‌కు ఇటీవల ఓ మెసేజ్ వచ్చింది. మద్యాన్ని బ్లాక్‌లో అమ్ముతున్నామని.. డబ్బులు ఆన్‌లైన్‌లో చెల్లిస్తే ఇంటికే డోర్ డెలివరీ చేస్తామని దాని ఆ మెసేజ్ సారాంశం. ఆ మెసేజ్ చూసి టెంప్టైన రాహుల్ .. వారిని సంప్రదించాడు. బగ్గా వైన్స్ పేరుతో క్యూఆర్ కోడ్ పంపించిన ఆ కేటుగాళ్లు.. దానికి నగదు ట్రాన్స్‌ఫర్ చేస్తే అరగంటలో మద్యం ఇంటికే పంపిస్తాంటూ చెప్పారు.
రాహుల్ వెంటనే.. ఆన్‌లైన్‌లో రూ.51వేలు పంపించాడు. అరగంటలో వస్తుందనుకున్న మద్యం.. రెండు రోజులైనా రాలేదు. దీంతో మోసపోయానని భావించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బగ్గా వైన్స్ పేరుతో కొన్ని రోజులుగా ఈ ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇప్పటికే బగ్గా వైన్స్ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది.