రాత్రికి రాత్రే టర్మినేషన్ లెటర్లు.. ఉద్యోగులకు 'ఐటీ' షాక్‌ ..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 April 2020 2:42 PM GMT
రాత్రికి రాత్రే టర్మినేషన్ లెటర్లు.. ఉద్యోగులకు ఐటీ షాక్‌ ..!

  • రెండు రోజుల్లో వెయ్యి మందికి టర్మినేషన్ లెటర్లు
  • మార్చి నెల‌ జీతం ఇచ్చి సాగనంపుతున్న కంపెనీలు
  • ‘ఇక పై మా కంపెనీ ఎంప్లాయ్స్ కాదు’ అంటూ మెయిల్స్

క‌రోనా వైర‌స్(కొవిడ్‌-19) ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి చాలా దేశాలు లాక్‌డౌన్ ను విధించాయి. దీంతో ప్ర‌జ‌లంతా ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. ఈ వైర‌స్ దెబ్బ‌కి చాలా రంగాలు కుదేల‌య్యాయి.

ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వ‌చ్చింద‌న్న చందంలా ఉంది హైద‌రాబాద్ ఐటీ ఉద్యోగుల ప‌రిస్థితి. అమెరికాలో క‌రోనా వైర‌స్ రోజు రోజుకు విజృంభిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా అమెరికాలో 8వేల మందికి పైగా మృత్యువాత ప‌డ‌గా.. మూడు ల‌క్ష‌ల మంది బాధితులు క‌రోనా పాజిటివ్‌తో చికిత్స పొందుతున్నారు. దీంతో అక్క‌డ ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా మారింది.

హైద‌రాబాద్ లో వంద‌ల సంఖ్య‌లో ఐటీ సంస్థ‌లు ఉన్నాయి. వీటిలో చాలా కంపెనీల‌కు అమెరికా నుంచే క్ల‌యింట్ లు ఉన్నారు. ప్ర‌స్తుతం అక్క‌డ సంక్షోభ స్థితి ఉంది. దీంతో అక్క‌డి నుంచి కొత్త ప్రాజెక్టులు త‌మ‌కు వ‌స్తాయో రావో న‌ని కంపెనీలు ఆలోచ‌న‌లో ప‌డ్డాయ‌ట‌. దీంతో ఖ‌ర్చులు త‌గ్గించుకునే ప‌నిలో ఉన్నాయి ఐటీ కంపెనీలు.

ఐటీ కంపెనీలు టెక్కీలకు పింక్ స్లిప్స్ పంపుతున్నాయట‌. ప్రస్తుత ప్రాజెక్టు పూర్తయిందని, ఇక కొత్త ప్రాజెక్టు లేదని టర్మినేషన్ లెటరను ఎంప్లాయిస్ కు మెయిల్ చేస్తున్నార‌ట‌. ఈ రెండు రోజుల్లో దాదాపు 1,000 మందిని ఉద్యోగం నుంచి తొలగించినట్టు సాఫ్ట్ వేర్ ఎక్స్‌పర్డ్స్ చెబుతున్నారు. భ‌విష‌త్‌లో ఈ సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఈ నెలాఖ‌రుకు దాదాపు ల‌క్ష మంది ఉద్యోగాల‌కు ఎసరు ఉంద‌ని అంటున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టుకు కావాల్సిన టెక్కీలను ఉంచుకుని మిగతా వారిని ఇంటికి పంపుతున్నారు.

క్యాంప‌స్ ప్లేస్‌మెంట్ల‌కు బ్రేక్‌..

రాష్ట్రంలో ఈ ఏడాది దాదాపు 10 వేల మందికి పైగా ప్రాంగ‌ణ నియామ‌కాల్లో ఎంపిక‌య్యారు. వారంద‌రూ జూన్ చివ‌రి వారం నుంచి ఆయా కంపెనీల్లో చేరాల్సి ఉంది. ఇప్పుడు విదేశాల నుంచి ప్రాజెక్టులు ఆగిపోయే అవ‌కాశం ఉండ‌డంతో ఆ ఉద్యోగాలు ద‌క్కుతాయా లేదా అన్న ఆందోళ‌న‌లో విద్యార్థులు ఉన్నారు. కొన్ని సాఫ్ట్ వేర్ సంస్థ‌లు అభ్య‌ర్థుల‌ను కొద్ది నెల‌ల కింద‌టే నియ‌మించుకున్నాయి. క‌రోనా నేప‌థ్యంలో వారు చేరాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆ సంస్థ‌లు స‌మాచారం అందిచాయి. ఓ సాఫ్ట్ వేర్ సంస్థ‌కు గ‌చ్చిబౌలిలో కార్యాల‌యం ఉంది. ఇక్క‌డ పనిచేసేందుకు కొద్ది నెల‌ల క్రితం 25 మందిని నియ‌మించుకుంది. వారంద‌రూ ఏప్రిల్ లో ఉద్యోగాల్లో చేరాల్సి ఉంది. యూకే నుంచి వ‌చ్చే ప్రాజెక్టు ఆగిపోయింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టు అవ‌స‌రం లేద‌ని యూకేకు చెందిన క్ల‌యింట్ చెప్ప‌డంతో ఆ 25 మందికి ఉద్యోగాలు లేవ‌ని స‌మాచారం ఇచ్చిన‌ట్లు సంస్థ అధికారు ఒక‌రు తెలిపారు.

ఈ రెండు రోజుల్లో దాదాపు వెయ్యి మందికి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల‌కు కంపెనీలు ట‌ర్మినేష‌న్ లెట‌ర్లు పంపిచిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. మార్చి నెల జీతం అందించిన మ‌రుస‌టి రోజే ట‌ర్మినేష‌న్ లెటర్లు పంపిన‌ట్లు తెలుస్తోంది.

ఇక నుంచి మీరు మా కంపెనీ ఉద్యోగస్తులు కాదు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ఆఫీసుకు వచ్చి సెటిల్ చేసుకోండి’ అన్నది ఆ మెయిల్స్ సారాంశం. సడెన్ గా ఉద్యోగం పోతే ఏం చేయాలో తెలియని అయోమయంలో పడ్డారు టెక్కీలు.

లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి వర్క్ ఫ్రం హోం చేస్తున్నా. ఈ నెల 2నుంచి ఎలాంటి వర్క్ ఇవ్వడంలేదు.తర్వాత కంపెనీతో నా యాక్సెస్ క‌ట్ చేశారు. ఎందుకని అడిగితే.. ‘ప్రాజెక్టు పూర్తయింది. కొత్త ప్రాజెక్టుకు పంపుతాం’అని చెప్పారు. కాని మరుసటి రోజే టర్మినేషన్ లెటర్ వచ్చింది.

– ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆవేద‌న‌

లాక్ డౌన్‌ ప్రకటించగానే.. మా ఊరికి వచ్చాను. ఇంటి నుంచే పనిచేస్తున్నా. మార్చి 30న జీతం పడింది. ఏప్రిల్ 2వ తేదీ మిడ్ నైట్ కంపెనీ నుంచి మెయిల్ వచ్చింది. ఉద్యోగం నుంచి తొలగించామని చెప్పారు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో జాబ్ అంత తొంద‌రగా దొరుకే అవ‌కాశం లేదు. దీంతో ఏం చేయాలో పాలు పోవ‌డం లేదు.

-మ‌రో ఉద్యోగి వేద‌న‌

Next Story