ఆగ‌స్టు వ‌ర‌కు 'ఒకే దేశం.. ఒకే రేష‌న్ కార్డు'

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 May 2020 12:49 PM GMT
ఆగ‌స్టు వ‌ర‌కు ఒకే దేశం.. ఒకే రేష‌న్ కార్డు

దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ఊతం ఇచ్చేందుకు కేంద్రం ప్ర‌క‌టించిన రూ.20ల‌క్ష‌ల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ రెండో రోజు వివ‌రాల‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వ‌ల‌స కార్మికుల‌ను కేంద్రం విస్మ‌రించ‌లేద‌న్నారు. వారికి మూడు ర‌కాల ప్ర‌యోజ‌నాలు క‌ల్పిస్తున్న‌ట్లు చెప్పారు. వ‌చ్చే రెండు నెల‌ల‌కు ఆహార ధాన్యాలు ఉచితంగా ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. రేష‌న్ కార్డు లేని వారికి సైతం ఆహార ధాన్యాలు అందించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. రేష‌న్ కార్డు ఉన్న‌వారు ఎక్క‌డైనా రేష‌న్ తీసుకోవ‌చ్చున‌ని, రేష‌న్ కార్డుదారులంద‌రికీ ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తామ‌న్నారు.

ఒక్కో వ్య‌క్తికి 5 కిలోల చొప్పున బియ్యం, గోధుమ‌లు పంపిణీ చేయ‌నున్నామ‌ని, అలాగే ఒక్కో కార్డుపై కిలో ప‌ప్పు ధాన్యాలు పంపిణీ చేయ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. రేష‌న్ కార్డు లేని వారు కూడా బియ్యం, గోధుమ‌లు, ప‌ప్పు పొంద‌వ‌చ్చున‌న్నారు. వ‌ల‌స కార్మికులు ఎక్క‌డ ఉన్నా.. కార్డు లేకున్నా ఆహార ధాన్యాలు వ‌చ్చున‌ని.. ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ బాధ్య‌త రాష్ట్ర ప్ర‌భుత్వాల‌దేన‌ని స్ప‌ష్టం చేశారు. రేష‌న్ కార్డు పోర్ట‌బులిటీ తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నాంమ‌ని, ఆగ‌స్టు నాటికి 'ఒకే దేశం ఒకే రేష‌న్ కార్డు' విధానం అమలోకి తీసుకొస్తామ‌ని చెప్పారు. ప్ర‌స్తుతం 63 కోట్ల మందికి ఈ కార్డు వెసులు బాటు ఉంద‌న్నారు.

Next Story