నేడే తొలి వన్డే.. సత్తా చాటేందుకు సిద్దమైన ఇరుజట్లు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 Dec 2019 12:47 PM ISTటీ20 సిరీస్ గెలిచి ఊపుమీదున్న టీమిండియా.. మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమైంది. వన్డే సిరీస్ విజయంపై కూడా గురి పెట్టింది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా.. ఆదివారం తొలి వన్డే జరుగనుంది. ఇక విండీస్.. ఆఫ్ఘన్‌పై గత సిరీస్‌ను గెలుచుకుంది. ఇప్పుడు పొలార్డ్ నేతృత్వంలో వన్డేల్లో సత్తాచాటి భారత్‌కు షాకివ్వాలని చూస్తోంది.
ఓపెనర్ శిఖర్ ధవన్ గాయంతో దూరమవడంతో మరో ఓపెనర్ కేఎల్ రాహుల్.. రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంబిస్తాడు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీతో ఫామ్ భారత్‌కు కలిసొచ్చే అంశం. నాలుగు, ఐదు స్థానాల్లో.. శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే కూడా సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే పాండే, కేదార్ జాదవ్ ఇద్దరిలో ఒకరు మాత్రమే జట్టులో ఉండే అవకాశం ఉంది.
ఇక.. యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పైనే అందరి దృష్టి ఉంది. ఇప్పటికైనా అతడు ఫామ్‌లోకి రావాలని అభిమానులతో సహా టీమ్ మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. రెండో టీ20లో మెరిపించిన శివమ్ దూబే ఈ మ్చాచ్ ద్వారా వన్డే అరంగేట్రం చేయనున్నాడు. స్పిన్నర్లు యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ మరోసారి కీలకంగా మారనున్నారు. గాయపడిన పేసర్ భువనేశ్వర్ స్థానంలో శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, దీపక్ చాహర్ పేస్ బాధ్యతలను మోయనున్నారు. ఆల్‌రౌండర్ స్థానం జడేజాకు దక్కనుంది.
కీరన్ పోలార్డ్ సారథ్యంలోని వెస్టిండీస్.. వన్డే సిరీస్ ఎలాగైనా నెగ్గాలని ఆశలు పెట్టుకుంది. ముంబై టీ20లో గాయపడ్డ ఎవిన్ లూయిస్ ఈ వన్డేలో ఆడే అవకాశముంది. పొలార్డ్, షై హోప్, హెట్‌మైర్, నికోలస్ పూరన్, కింగ్‌లతో పాటు ఆల్‌రౌండర్ రోస్టన్ చేజ్ లతో జట్టు సమతూకంగా ఉంది. పేసర్లు కాట్రెల్, అల్జరీ జోసెఫ్.. లెగ్ స్పిన్నర్ హేడెన్ వాల్ష్ సత్తా చాటడానికి సిద్దంగా ఉన్నారు.
భారత్: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, దీపక్ చాహర్, రిషభ్ పంత్, కేదార్ జాదవ్, శివమ్ దూబే,
వెస్టిండీస్: కీరన్ పొలార్డ్ (కెప్టెన్), జాసన్ హోల్డర్, కాట్రెల్, షెఫర్డ్, హేడెన్ వాల్ష్, జొసెఫ్, ఎవిన్ లూయిస్/బ్రాండన్ కింగ్, షై హోప్, రోస్టన్ చేజ్, హెట్‌మైర్, నికోలస్ పూరన్.