కరోనా విలయం : కోటి కేసులు.. 5లక్షల మరణాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Jun 2020 9:14 AM IST
కరోనా విలయం : కోటి కేసులు.. 5లక్షల మరణాలు

చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. 213 దేశాల్లో కోటి మందికి పైగా ఈ వైరస్‌ బారీన పడ్డారు. గడిచిన 24గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా 1,74,034 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,00,72,581. 4,525 మంది చనిపోవడంతో మరణాల సంఖ్య 5,00,604కి పెరిగింది. కాగా.. గత కొన్ని రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజు లక్షకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.

గత సంవత్సరం డిసెంబర్ 16న సార్స్ తరహా కొత్త వైరస్ వెలుగులోకి వచ్చిందని తెలిసిన వేళ, ఏదో మామూలు వైరస్ అనుకున్నారే తప్ప, కరోనా ఉగ్రరూపాన్ని అప్పుడెవరూ ఊహించలేదు. ఆపై వైరస్ అంతకంతకూ పెరిగి, ఐరోపా దేశాల మీదుగా అమెరికాలోకి ప్రవేశించింది. యూరప్ లోని ఇటలీ, యూకే, స్పెయిన్ తదితర దేశాలు ఈ వైరస్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కొన్ని దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా, అమెరికాను ఇంకా మహమ్మారి వదిలి పెట్టలేదు.

ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా కరోనా కేసులు నమోదు అవుతున్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఇప్పటి వరకు అక్కడ 25,96,537 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 1,28,1452 మంది మృత్యువాత పడ్డారు. ఆతరువాతి స్థానాల్లో బ్రెజిల్‌, రష్యా, భారత్‌ ఉన్నాయి. బ్రెజిల్‌లో 13లక్షలకు పైగా కేసులు నమోదు కాగా.. 57వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రష్యాలో 6లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 8వేల మందికి పైగా మృత్యువాతపడ్డారు. ఇక భారత్‌లో 5లక్షలకు పైగా కేసులు నమోదు కాగా.. 16వేల మందికిపైగా చనిపోయారు.

Next Story