Fact Check : పాకిస్థాన్ లో హిందూ మహిళను లాయర్లు ఇష్టం వచ్చినట్లు కొట్టారా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 28 Oct 2020 2:47 PM GMTట్విట్టర్ యూజర్ @Pradeep5424243 ఓ మహిళను కొందరు వ్యక్తులు కొడుతున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. పాకిస్థాన్ లో హిందూ మహిళను ఇలా కొడుతూ ఉన్నారని చెప్పుకొచ్చారు. 'ఈ వీడియో పాకిస్థాన్ కు చెందినది.. హిందూ మహిళలను బలవంతంగా పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే వారు నిరసన వ్యక్తం చేస్తారో ఇలా విచక్షణా రహితంగా దాడి చేసి కొడతారు.. ఇలాగే ఉంటే భారత్ కూడా ఓ రోజు పాకిస్థాన్ లా మారిపోతుంది' అంటూ పోస్టు పెట్టారు. #Hindu #Hindutva #Hinduism అనే హ్యాష్ ట్యాగ్ లను ఉపయోగించారు.
ये पाकिस्तान का वीडियो है हिन्दू बहनो से जबरन निकाह किया जा रहा जब विरोध होता है तब ऐसे मारते है ऐसे रहा तो भारत भी एक दिन
पाकिस्तान बन जाएगा। #Hindu #Hindutva #hinduism pic.twitter.com/4ZHwQM9wG7
— P. Aggarwal (Veteran - Col) (@Pradeep54242413) October 24, 2020
నిజ నిర్ధారణ:
ఈ ఘటన పాకిస్థాన్ లో చోటు చేసుకున్నదే, వీడియోలో ఉన్న సదరు మహిళ కూడా ముస్లిం మతానికి చెందిన వారే..! ఈ ఘటనకు మతపరమైన యాంగిల్ ను జోడిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తూ ఉన్నారు.
వీడియోకు సంబంధించిన కీఫ్రేమ్స్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ ఘటన అక్టోబర్ 2019న చోటు చేసుకుంది. పాకిస్థానీ న్యూస్ పేపర్ Dawn కూడా ఈ ఘటనపై 31, అక్టోబర్, 2019న కథనాన్ని ప్రచురించింది. 'అమ్రత్ షాజాదీ అనే మహిళ షాపూర్ భంగు గ్రామంలో నివసిస్తూ ఉంటుంది. ఓ భూతగాదా విషయమై ఆమె శాఖార్గర్హ్ కోర్టుకు వచ్చింది. ఆమెను, ఆమె బంధువైన అబ్దుల్ ఖయ్యూమ్ ను లాయర్లు, ఇంకొందరు కలిసి ఆమె మీద దాడి చేశారు.
Samaa TV, Geo TV, Naya Daur TV మీడియా సంస్థలు ఈ ఘటనపై కథనాలను ప్రచురించాయి.
ఈ ఘటనకు సంబంధించిన కీవర్డ్ సెర్చ్ చేయగా ఎఫ్.ఐ.ఆర్. కాపీ బయటకు వచ్చింది. తాహిర్ ఇమ్రాన్ మియాన్, బీబీసీ ఉర్దూ మాజీ ఉద్యోగి నవంబర్ 1, 2019న ట్వీట్ చేశారు. అందులో ఎఫ్.ఐ.ఆర్. కాపీతో పాటూ చేతికి బేడీలతో ఉన్న వ్యక్తికి సంబంధించిన ఫోటోను కూడా పోస్టు చేశారు. శాఖార్గర్హ్ కోర్టు వద్ద మహిళను తన్నిన వ్యక్తి ఇతడేనని చెప్పుకొచ్చాడు.
ఎఫ్.ఐ.ఆర్. లో 'అడ్వొకేట్లు యాసిర్ ఖాన్, వసీం లతీఫ్, అసిఫ్ సుల్తాన్ లు అమ్రత్ షాజాది డాటర్ ఆఫ్ మొహమ్మద్ సులేమాన్ అన్సారీ, ఆమె కజిన్ అబ్దుల్ ఖయూమ్ మీద దాడి చేశారు' అంటూ రాసుకొచ్చారు.
మీడియా రిపోర్టులు, ఎఫ్.ఐ.ఆర్. కాపీ ద్వారా వీడియోలో ఉన్న మహిళ ముస్లిం అని స్పష్టంగా తెలుస్తోంది. ఆమెను భూతగాదా విషయంలోనే కొట్టడం జరిగింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
గత ఏడాది అక్టోబర్ లో కూడా కొన్ని గ్రూపులు సామాజిక మాధ్యమాల్లో మతతత్వ యాంగిల్ లో తప్పుడు కథనాలను పోస్టు చేశారు. కానీ ఈ ఘటనకు మతతత్వ గొడవలకు ఎటువంటి సంబంధం లేదు. వైరల్ అవుతున్న పోస్టులు 'పచ్చి అబద్ధం'.