ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలీదు కానీ.. దారి తప్పిన జంతువులు ఇటీవల కాలంలో మెట్రో రైలులో మనుషులతో పాటు ప్రయాణం చేస్తున్న ఘటనలు చూశాం. తాజాగా హంకాంగ్ దేశంలో ఓ అడవి పంది మెట్రో రైలులో హల్‌చల్ చేసింది. సమీపంలోని అడవుల్లోంచి క్వారీ బే రైల్వే స్టేషన్‌కు వచ్చింది. టిక్కెట్ కౌంటర్ సందులోంచి ప్లాట్ ఫారమ్ మీదకు వెళ్లింది. అక్కడ రైలు ఆగి ఉండడంతో అందులోకి ఎక్కింది. దీంతో ప్రయాణీకులు భయపడ్డారు.
ఇక రైలు లోని బోగీలన్ని దర్జాగా తిరిగింది. అలసట రావడంతో ఓ సీటు చూసుకుని ఎంచక్కా నిద్రపోయింది. రైలు కొన్ని స్టేషన్లు ప్రయాణించిన అనంతరం ఆ అడవిపంది రైలు దిగి మరో రైలు ఎక్కింది. దీంతో అప్పటి వరకు దానిని గమనిస్తున్న ప్రయాణీకులు ఆశర్చపోయారు. గతంలో రైలు ప్రయాణం చేసినట్లు అనుభవం ఉన్నట్లుగా ఆ పంది ప్రవర్తించింది. రెండోసారి ఎక్కిన రైలు నేరుగా డిపోకి వెళ్లింది. దీంతో అధికారులు ఆ అడవి పందిని పట్టుకుని సమీపంలోని అడవిలో వదిలివేశారు.
హాంకాంగ్ దేశంలో దట్టమైన అడవులు అనేకం ఉన్నాయి. దీంతో అక్కడ అడవిపందులు అప్పుడప్పుడు అడవిని వదిలి రోడ్డుమీదకు వస్తుంటాయి. వీటి వలన ఒక్కోసారి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. అయినప్పటికి వీటికి అక్కడి ప్రజలు ఎటువంటి హానీ కనిగించరు.