ఏడు జ‌న్మ‌లు కాదు.. ఏడు సెక‌న్లు కూడా ఈ భార్యలు మాకొద్దు

Wife victim Men worship peepal tree in Aurangabad.పెళ్లంటే నూరేళ్ల పంట అని అంటారు. పెళ్లి అనేది ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Jun 2022 6:06 AM GMT
ఏడు జ‌న్మ‌లు కాదు.. ఏడు సెక‌న్లు కూడా ఈ భార్యలు మాకొద్దు

పెళ్లంటే నూరేళ్ల పంట అని అంటారు. పెళ్లి అనేది ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో ఓ అంద‌మైన వేడుక‌. వివాహానికి హాజ‌రైన వారంతా నిండు నూరేళ్లు క‌లిసి ఉండాల‌ని కొత్త‌ జంటను దీవిస్తుంటారు. ఇక దంప‌తులు కూడా ఒక‌రి కోసం ఒక‌రు అన్న‌ట్లు బ్ర‌తుకుతూ ఉంటారు. భార్యాభ‌ర్త‌ల బంధంలో అల‌క‌లు, కోపాలు, గొడ‌వ‌లు స‌హ‌జం. భ‌ర్త ఎలాంటి వాడు అయినా స‌రే స‌గ‌టు భార‌తీయ మ‌హిళ..ఏడేడు జ‌న్మ‌ల‌కు అత‌డే త‌న భ‌ర్త‌గా రావాల‌ని కోరుకుంటుంది. అందుకోసం వ‌త్రాలు, పూజాలు కూడా చేస్తుంటుంది.

అందులో ముఖ్య‌మైన ది వ‌ట సావిత్రి వ‌త్రం. సావిత్రి తన భర్త సత్యవంతుడిని యమధర్మరాజు నుంచి రక్షించుకుంది. ఈ నేపథ్యంలో తమ భర్తలు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని, ఏడేడు జన్మలకు వారే తమ భర్తలుగా ఉండాలని కోరుకుంటూ పౌర్ణమి రోజు వట సావిత్ర వ్రతాన్ని ఆచరిస్తుంటారు మ‌హిళ‌లు. కాగా..సోమ‌వారం వ‌ట‌సావిత్రి పౌర్ణ‌మి సంద‌ర్భంగా చాలా మంది మ‌హిళ‌లు ఈ వ‌త్రాన్ని ఆచ‌రించారు.

ఇదిలా ఉంటే.. ఈ భార్య‌లు మాకొద్దు అంటూ భార్యా బాధితుల సంఘం స‌భ్యులు సోమ‌వారం ఈ వ‌త్రాన్ని ఆచ‌రించారు. ఏడు జ‌న్మ‌లు కాదు ఏడు సెక‌న్లు కూడా అవ‌స‌రం లేద‌ని దేవుడిని కోరుకున్నారు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని ఔరంగాబాద్‌లో చోటు చేసుకుంది. వలూజ్‌ ఏరియాలోని పత్నీపీడిత్ అనే పేరుతో నడుస్తున్న భార్యాబాధిత ఆశ్రమంలో భార్యాబాధితులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారందరూ కలిసి వట సావిత్రి పూర్ణిమ వ్రతం నిర్వహించారు. ఈ భార్యలు తమకు ఏడేడు జన్మలు కాదని, ఏడు క్షణాలు కూడా తమకొద్దంటూ పీపల్ చెట్టుకు పూజలు.. చేసి దారాలు కట్టారు.

'కొందరు మహిళలకు పీపల్ చెట్టును పూజించే అర్హత లేదు. తమకు అనుకూలంగా చట్టాలు ఉండడంతో కొందరు మహిళలు భర్తలను వేధిస్తున్నారు. భ‌ర్త‌ కుటుంబ సభ్యులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసులు పెడుతున్నారని' భార్యాబాధిత సంఘానికి చెందిన ఒకరు అన్నారు. ఈ ఏకపక్ష చట్టం పురుషులను స్త్రీలకు బానిసలుగా మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పురుషులకు కూడా సాధికారత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా.. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

Next Story