ఈ పెండ్లి కార్డు చూసినోళ్లంతా నోరెళ్లబెడుతున్నారు

Wedding card viral in social media.ఓ వివాహ జంట పెళ్లికి రాకండి అని అంటూనే ఈ వేడుక‌ను ఆన్‌లైన్‌లో చూడ‌మంటూ త‌మ పెళ్లి ప‌త్రిక‌ను ముద్రించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 April 2021 3:07 AM GMT
variety wedding card

ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా ఉద్దృతి కొన‌సాగుతోంది. దీంతో శుభ‌కార్యాలు చేసుకునేందుకు జ‌నం జంకుతున్నారు. కొంద‌రు క‌రోనా నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ వివాహాలు చేసుకుంటున్నారు. దీంతో ఎక్కువ మంది పెళ్లికి వెళ్లేందుకు లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలోనే ఓ వివాహ జంట ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకుండా వినూత్న ఆలోచన చేసింది. పెళ్లికి రాకండి అని అంటూనే ఈ వేడుక‌ను ఆన్‌లైన్‌లో చూడ‌మంటూ త‌మ పెళ్లి ప‌త్రిక‌ను ముద్రించింది. ప్ర‌స్తుతం ఈ పెళ్లి ప‌త్రిక సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం దర్గపల్లి గ్రామానికి చెందిన జీల నిర్మల – మల్లేశ్‌ యాదవ్‌ దంపతుల కుమారుడు జీల అనిల్‌ యూ ట్యూబ్‌ వీడియోలు చేస్తుంటాడు. అతనికి ఇటీవలే ఆమనితో వివాహం నిశ్చయమైంది. మే 1 వీరి వివాహం జ‌ర‌గ‌నుంది. ఈ సంద‌ర్భంగా త‌న బంధుగ‌ణానికి ప‌త్రిక‌ను పంపేందుకు రూపొందించారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు పేర్ల ప‌క్క‌న కొవిడ్ నెగెటివ్ సూచ‌న‌, పెళ్లికి రాకండంటూ.. వేడుక‌ను ఆన్‌లైన్‌లో చూడ‌మంటూ.. అందుకోసం ఒక జీబీ డేటాను ఫోన్‌లో పెట్టుకోండ‌న్న అభ్య‌ర్థ‌న‌ల‌తో ప్ర‌త్యేకంగా రూపొందించిన పెళ్లి ప‌త్రిక ఆక‌ట్టుకుంటోంది.

ఇక క‌ట్నాలు, కానుక‌లు ఇవ్వాల‌ని అనుకునే వారంతా గూగుల్ పే క్యూ ఆర్ కోడ్ ద్వారా పంపాల‌ని అభ్య‌ర్థించారు. ఆ న‌గ‌దునంతా క‌రోనా వేళ ఆక‌లితో అల‌మ‌టించే వాళ్ల‌కు అందిస్తాన‌ని హామీ ఇచ్చారు. ఇక పెళ్లి తంతును మొత్తం ఇన్ స్టాగ్రామ్‌లో చూడొచ్చున‌ని తెలిపారు. ఇక బంధువులందరూ ఎవరింట్ల వాళ్లు బరాత్‌ డ్యాన్స్‌ చేసి ఈ వీడియో పంపితే అది కూడా లైవ్‌ పెడతామని చెప్పడం మరో విశేషం.ఆ పెండ్లి కార్డు చూసినోళ్లంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నరు. ప్ర‌స్తుతం ఈ పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.


Next Story