ఇన్‌హేలర్ లోప‌ల పాము.. షాకైన యువ‌తి.. ఎం జ‌రిగిందంటే..?

Venomous Snake Found in Asthma Inhaler. ఓ యువ‌తికి విచిత్ర సంఘ‌ట‌న ఎదురైంది. ఇన్‌హేల‌ర్ లోప‌ల పాము క‌నిపించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 March 2021 3:03 PM IST
Venomous Snake Found in Asthma Inhaler

పాములు ఇళ్లలోకి చొరబ‌డటం అనేక సార్లు చూసే ఉంటాం. మంచం కింద‌, స్టోర్ రూం, బైక్‌ల‌లో షూలో దూరి చాలా మందిని కాటేసిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఓ యువ‌తికి విచిత్ర సంఘ‌ట‌న ఎదురైంది. ఇన్‌హేల‌ర్ లోప‌ల పాము క‌నిపించింది. విన‌డానికి కాస్త ఆశ్చ‌ర్యంగా ఉన్నా ఇది నిజం. ఈ ఘ‌ట‌న ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. క్వీన్స్‌ల్యాండ్‌కు చెందిన ఓ యువతికి ఆస్త‌మా ఉంది. ఆస్త‌మా నుంచి ఉప‌శ‌మ‌నం కోసం ఆ యువ‌తి ఇన్‌హేల‌ర్ ఉప‌యోగించేది. ఎప్ప‌టిలాగేనే ఉప‌యోగించి ప‌క్క‌న పెట్టింది.

ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో తెలీదు కానీ ఓ పాము పిల్ల వ‌చ్చి ఇన్‌హేల‌ర్ లోప‌ల దూరింది. అయితే.. ఇన్‌హేల‌ర్ వాడుదామ‌నుకున్న ఆ యువ‌తి ఎందుక‌నో ఓ సారి ప‌రిశీల‌న చూసింది. ఇన్‌హేల‌ర్‌లో పాము పిల్ల క‌నిపించ‌డంతో షాక్ గురైంది. వెంట‌నే షాక్ నుంచి తేరుకున్న ఆ యువ‌తి పాములు ప‌ట్టే వారికి స‌మాచారం ఇచ్చింది. వెంట‌నే వారు వ‌చ్చి దానిని ప‌ట్టుకున్నారు. పాము చిన్న‌దే అయినా.. దాని విషం చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని వారు చెప్పారు. ఇప్పటివరకు ఎన్నో ప్రదేశాలలో పాములు చూశాను కానీ ఈ విధంగా ఇన్ హెలర్ లోపల పాము దాగి ఉండటం ఎంతో ఆశ్చర్యంగా ఉందంటూ పాములు పట్టే వారు తెలియజేశారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.




Next Story