సోదరుడికి దూరమైన మహిళ.. 18 ఏళ్ల తర్వాత కలిపిన ఇన్‌స్టా

పద్దెనిమిది ఏళ్ల క్రితం ఓ మహిళ తన సోదరుడికి దూరం అయ్యింది.

By Srikanth Gundamalla  Published on  29 Jun 2024 6:12 AM GMT
uttar Pradesh, man missing,   instagram,

సోదరుడికి దూరమైన మహిళ.. 18 ఏళ్ల తర్వాత కలిపిన ఇన్‌స్టా

పద్దెనిమిది ఏళ్ల క్రితం ఓ మహిళ తన సోదరుడికి దూరం అయ్యింది. ఏళ్లు గడిచినా సోదరుడిని మాత్రం మరువలేదు. అతని జ్ఞాపకాలను గుర్తు చూసుకుంటూ ఉండేది. ఇటీవల మహిళ ఒక ఇన్‌స్టా పోస్టు చూసింది. అచ్చం ఆమె సోదరుడిలా అనిపించాడు. చిన్నప్పుడు విరిగిన పన్నుతో చూసిన మహిళ.. దాన్ని బట్టే గుర్తించింది. అంతే.. ఆమె ఇన్‌స్టాలో సంప్రదించింది. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చివరకు అతడు తన సోదరుడే అని తెలిసి ఆమె మురిసిపోయింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ ఘటన వెలుగు చసింది.

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని హథీపూర్ గ్రామానికి చెందిన రాజ్‌కుమారీ సోదరుడు బాల్‌ గోవింద చిన్నప్పుడే పని కోసం ముంబై వెళ్లాడు. ఆ తర్వాత స్నేహితులకు దూరంగా మరో పనికి వెళ్లాడు. స్వగ్రామంలో ఉన్న బంధువులు, కుటుంబ సభ్యులతో అప్పుడప్పుడు టచ్‌లో ఉండేవాడు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఆ సంబంధం కూడా బలహీనపడింది. స్నేహితులు అంతా తిరిగి యూపీ వచ్చినా.. బాల్‌ గోవింద మాత్రం రాలేదు. అతను రైల్లో స్వగ్రామానికి బయల్దేరిన క్రమంలో తప్పిపోయాడు.

అనారోగ్యంతో ఉన్న బాల్‌ గోవింద స్వగ్రామానికి రైలులో వెళ్తున్న క్రమంలో కాన్పూర్‌లో దిగడానికి బదులు జైపూర్‌కు చేరుకున్నాడు. తాను ఏ స్థితిలో ఉన్నాడో తనే గుర్తించలేని స్థితిలో పడ్డాడు. దాంతో.. రైల్వే స్టేషన్‌లోని ఓ వ్యక్తి సాయం చేశాడు. తన వెంట తీసుకెళ్లి ఫ్యాక్టరీలో ఉద్యోగానికి పెట్టించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు కుదురుకున్న బాల్‌ గోవింద... అక్కడే ఈశ్వరీ దేవి అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఇటు తన స్వగ్రామం విషయమే మర్చిపోయాడు. వారి వైవాహిక జీవితానికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఇక చిన్నప్పుడు విరిగిన పన్నులో ఎలాంటి మార్పు లేదు. బాల్‌ గోవింద్ రీల్స్ చేయడం ప్రారంభించాడు. అతని రీల్‌ తన సోదరి అయిన రాజ్‌కుమారీకి చేరింది. ఆ విరిగిన పన్నునే ఆనవాలుగా చేసుకుని సోదరుడిని కలుసుకుంది. ఇక చివరకు 18 ఏళ్ల తర్వాత స్వగ్రామానికి వెళ్లిన బాల్ గోవింద్‌ను చూసిన కుటుంబం మొత్తం ఎంతో సంతోషపడింది.

Next Story