భార్య కొడుతోందని.. 80 అడుగుల చెట్టు ఎక్కిన భర్త.. నెలరోజులుగా అక్కడే
Upset over Fight with Wife UP Man Uses 80feet Tall Tree as Kop Bhavan.సాధారణంగా భార్యా భర్తల మద్య గొడవలు జరగడం సహజం
By తోట వంశీ కుమార్ Published on 27 Aug 2022 11:16 AM ISTసాధారణంగా భార్యా భర్తల మద్య గొడవలు జరగడం సహజం. దంపతులు కొట్టుకున్న, తిట్టుకున్న కాసేపటికే కలిసి పోతుంటారు. అయితే.. ఇక్కడో వ్యక్తి భార్య కొడుతోందంటూ 80 అడుగుల ఎత్తున్న ఫామ్ చెట్టుపైకి ఎక్కాడు. నెల రోజులుగా అక్కడే ఉంటున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. యూపీలోని కోపగంజ్ అనే ప్రాంతంలో రామ్ ప్రవేశ్ అనే వ్యక్తి తన కుటుంబంతో నివసిస్తున్నాడు. అయితే.. దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవని స్థానికులు చెబుతున్నారు. భార్య తీరుతో విసుగు చెందిన రామ్ ప్రవేశ్ 80 అడుగుల చెట్టుపైకి ఎక్కి ఎక్కాడు. గత నెలరోజులుగా ఆ చెట్టుపైనే ఉంటున్నాడు. అతడి కుటుంబ సభ్యులు ఆహారం, నీటిని తాడుతో కట్టి చెట్టు దగ్గర వేలాడదీస్తుండేవారు. అతను వాటిని పైకి లాక్కొని అక్కడే తింటున్నాడు. రాత్రిపూట చెట్టుపై నుండి దిగి, మలవిసర్జన చేసి తిరిగి చెట్టుపైకి ఎక్కుతున్నాడని అంటున్నారు.
అతడిని కిందకు దింపేందుకు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఎన్ని ప్రయత్నాలు చేసిన్పపటికి అతడు నిరాకరిస్తూ వస్తున్నాడు. దీంతో గ్రామస్తులు పోలీసులకు ఫోన్ చేశారు. వారు వచ్చి నచ్చజెప్పినప్పటికీ రామ్ ప్రవేశ్ వినకపోవడంతో వారు వీడియో తీసుకుని వెళ్లిపోయారు. ప్రస్తుతం అతడు చెట్టుపైన కూర్చున వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
దీనిపై గ్రామపెద్ద దీపక్‌కుమార్ మాట్లాడుతూ.. అతడు చెట్టుపైన జీవించడం వల్ల చుట్టు పక్కల ఇళ్లలో నివసించే వారు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి ఇళ్లలో ఏమి జరుగుతుందనేది అతడు చూస్తుండడం వారి గోప్యతకు భంగం కలిగించడమే. ఇప్పటికే ఈ విషయమై పలువురు మహిళలు వచ్చి ఫిర్యాదు చేశారు. అందుకనే పోలీసులకు ఫోన్ చేశాం. వారు వచ్చి వీడియో తీసుకుని వెళ్లిపోయారు. అతడిని చెట్టు దించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని అన్నారు.