ప్రజలను కాపాడడం పోలీసుల విధి. దాని కోసం వారు ఎన్నో త్యాగాలను చేస్తుంటారు. కొన్ని సార్లు కుటుంబాలకు దూరంగా ఉంటూ విధులు నిర్వర్తిస్తుంటారు. వారు కూడా మనుషులే కదా. వారికి ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఓ పోలీసు కానిస్టేబుల్ పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లైన వెంటనే తన భార్యను పుట్టింటిలో వదిలి వెంటనే డ్యూటీలో జాయిన్ అయ్యాడు. చాలా రోజులు అయినప్పటికీ అతడు ఇంటికి వెళ్లలేదు. అతడి భార్య అలిగింది. ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. దీంతో తన పై అధికారికి సెలవు కావాలి అంటూ రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో గౌరవ్ చౌదరి అనే కానిస్టేబుల్‌కు గత డిసెంబర్‌లో పెళ్లైంది. వివాహామైన వెంటనే అతడు భార్యను పుట్టింటిలో వదిలి తిరిగి డ్యూటీలో జాయిన్ అయ్యాడు. అప్పటి నుంచి అతడు ఇంటికి వెళ్లలేదు. దీంతో అతడి భార్య అలిగింది. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. దీంతో సెలవు పెట్టి భార్యను బుజ్జగించాలని బావించాడు. అంతే సెలవు కోరుతూ పై అధికారులకు లీవ్ లెటర్ రాశాడు.
"వివాహం అయిన వెంటనే భార్యను వదిలి వచ్చాను. దీంతో ఆమె నా పై అలిగింది. నేను ఎన్ని సార్లు ఫోన్ చేసిన ఎత్తడం లేదు. కాల్ కట్ చేస్తోంది. ఒక్కొసారి ఎత్తినా మాట్లాడడం లేదు. వాళ్ల అమ్మకి ఇస్తుంది మాట్లాడమని. వెంటనే నేను ఇంటికి వెళ్లాలి. నా భార్యను బుజ్జగించాలి. దయచేసి నా బాధను అర్థం చేసుకుని ఓ వారం రోజులు సెలవు ఇవ్వండి." అని పై అధికారులకు లేఖ రాశాడు.
అతడి బాధను అర్థం చేసుకున్న ఏఎస్పీ అతడికి ఐదు రోజులు సెలవు ఇచ్చాడు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటీజన్లు తమదైన శైలిలో దీనిపై స్పందిస్తున్నారు.