సాధారణంగా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ మానవులు చేయించుకుంటారు. కానీ.. జంతువులకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయడం చూశారా..? అది కూడా సింహానికి..? నెదర్లాండ్స్‌లోని ఓ జూలో 11 ఏళ్ల ఓ మగ సింహానికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేశారు. వెటర్నరీ డాక్టర్ హెంక్ లూటెన్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. హెంక్ లూటెన్ మాట్లాడుతూ.. థార్ అనే 11 ఏళ్ల మగసింహం జూలోని రెండు ఆడ సింహాలతో జత కట్టింది. వీటిలో మొదటి దానికి రెండు, రెండో దానికి మూడు కూనలు పుట్టాయి. ఇప్పటికే థార్ డీఎన్ఏ తమ జూలో చాలా ఉందని దాని జన్యు సమూహం ఎక్కువగా ఉండాలని మేము కోరుకోవట్లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
ఇక తన 35ఏళ్ల సర్వీసులో ఓ సింహానికి ఇలాంటి ఆపరేషన్ చేయడం ఇదే తొలిసారి అని చెప్పారు. సింహానికి వేసక్టమీ చేయ్యడం చాలా అరుదని.. ఎక్కువగా కాస్ట్రేషన్(వీర్యహరణం) చేస్తారన్నారు. అయితే.. దీని వల్ల సింహాలు అనారోగ్యానికి గురవుతాయని చెప్పారు. కాస్ట్రేషన్ వల్ల సింహం జూలు త్వరగా ఊడిపోయి అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. అందుచేతనే వేసక్టమీ చేసినట్లు చెప్పారు. కాస్ట్రేషన్ చేయడం వలన టెస్టోస్టెరాన్ లోపం తలెత్తుతుందని, దీని వలన సింహం పటుత్వాన్ని కోల్పోతుందన్నారు.