వాలెంటైన్స్ డే వెనుక ఉన్న స్టోరీ ఏంటంటే..?

The stories Behind Valentines day.ప్రేమికుల కోసం ఓ రోజు ఉంది. అదే వాలంటైన్స్ డే.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Feb 2021 3:45 PM GMT
The stories behind Valentines Day

అమ్మ‌ల‌ కోసం మదర్స్ డే, తండ్రుల కోసం ఫాదర్స్ డే, సోదరీమణుల కోసం సిస్టర్స్ డే, మహిళల కోసం ఉమెన్స్ డే.. ఇలా అందరికీ ప్రత్యేకంగా ఓ రోజు ఉన్నట్లే.. ప్రేమికుల కోసం ఓ రోజు ఉంది. అదే వాలంటైన్స్ డే. నిజానికి ప్రేమను వ్యక్తం చేయడానికి ఒక రోజు అంటూ ప్రత్యేకంగా ఉండాల్సిన అవ‌స‌రం లేదు. ప్రేమను ఎప్పుడైనా.. ఎవ‌రైనా వ్య‌క్తం చేయొచ్చు. అయితే వాలెంటైన్స్ డే జరుపుకోవడం వెనుక ఓ చరిత్ర ఉంది. అసలు వాలెంటైన్స్ డే అంటే ఏంటీ? ఆ రోజును ప్రేమికుల రోజుగా ఎందుకు గుర్తిస్తారు? ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు ఎందుకు జరుపుకొంటారు? ప‌్రేమికుల రోజుకి ఉన్న చ‌రిత్ర ఏంటో తెలుసుకుందాం.

వాలెంటైన్ పేరు ప్రేమికుల రోజు ప‌ర్యాయ‌ప‌దంగా మారిపోయింది. ఇంత‌కీ వాలెంటైన్ ఎవ‌రు అంటే.. చాలా క‌థ‌లు ప్ర‌చారంలో ఉన్నాయి. అయితే.. ఎక్కువ మంది న‌మ్మేది ఏంటంటే.. క్రీస్తు శకం 270 లో రోమ్ న‌గ‌రంలో సెయింట్ వాలెంటైన్ అనే క్రైస్త‌వ మ‌త‌గురువు నివ‌సిస్తూ ఉండేవాడు. హింస, స్వార్థం, ద్వేషం లాంటి చెడుపై పోరాడటానికి ప్రేమ తప్ప మరో ఆయుధం లేదని నమ్మేవాడు. తాను నమ్మిన ప్రేమ సిద్ధాంతాన్ని ఇతరులకు భోదించేవారు. అలా వాలెంటైన్ సిద్ధాంతాన్ని బోధిస్తూ.. యువతీ యువకుల మధ్య ప్రేమ చిగురించేలా చేసేవారు. అంతేకాదు యువతీయువకులకు ప్రేమలో ఉన్న వారికి దగ్గరుండి మరీ వివాహాలు జరిపించేవారు.

అయితే.. అదే సమయంలో రోమ్‌ను క్లాడియ‌స్ అనే చ‌క్ర‌వ‌ర్తి పాలిస్తూ ఉండేవాడు. త‌న రాజ్యంలో పెళ్లిళ్ల‌ను నిషేదించాడు. ఎందుకంటే.. మ‌గ‌వాళ్లు పెళ్లి చేసుకుంటే మంచి సైనికులు కాలేర‌న్న అభిప్రాయం ఆయ‌న‌లో ఉండేది అందుక‌నే వివాహాల‌ను నిషేదించాడు. అయితే.. రాజు గారి ఆజ్ఞ వాలెంటైన్‌కు న‌చ్చ‌లేదు. దీంతో ర‌హ‌స్యంగా యువ‌తీ యువ‌కుల‌ను వాలెంటైన్ పెళ్లిళ్లు చేసేవాడు. విష‌యం తెలిసిన క్లాడియ‌స్‌.. వాలెంటైన్ ని బంధించాడు. అయిన‌ప్ప‌టికి వాలైంటైన్ ప్ర‌వ‌ర్త‌న‌లో ఎటువంటి మార్పు రాలేదు. జైల్లో జైల‌ర్ కుమారైతో వాలెంటైన్ ప్రేమ‌లో ప‌డ్డాడు. ఫిబ్ర‌వ‌రి 14న మ‌ర‌ణ‌శిక్ష అమ‌లు చేయ‌డానికి ముందు వాలెంటైన్ జైల‌ర్ కుమారైకు ఓ ల‌వ్‌లెట‌ర్ పంపించారు. వాలెంటైన్‌ మరణించేవరకు ప్రియురాలి గురించే తలచుకునేవాడు. ప్రియురాలికి ఇచ్చే లేఖలో 'Your Valentine' అనే మాట వాడేవాడు. ఫిబ్రవరి 14న వాలెంటైన్‌ను ఉరి తీశారు. ఎందరో యువతీయువకుల ప్రేమ వివాహాలకు కారణమైన వాలెంటైన్ మరణించిన రోజే‎ ప్రేమికుల రోజు గా జరుపుకోవడం మొదలు పెట్టారు. దీనినే వాలెంటైన్స్ డే గా పిలుస్తారు.

మ‌రో క‌థ‌నం ఏంటంటే..?

ఫిబ్రవరి మధ్యలో రోమన్లు లుపర్‌కాలియా అనే వేడుక చేసుకునేవాళ్లు. అది వారికి వసంతకాలం. ఈ వేడుకల్లో భాగంగా ఒక్కో కాగితంపై ఒక్కో అమ్మాయి పేరు రాసి వాటిని ఒక బాక్సులో వేసేవారు. తర్వాత అబ్బాయిలు వచ్చి ఆ బాక్సులోంచి చిటీలు తీసేవారు. ఆ స్లిప్‌లో ఏ అమ్మాయి పేరైతే ఉంటుందో ఆ అమ్మాయి ఆ ఫెస్టివల్‌లో అతనికి ప్రేయసిగా ఉండాలి. ఇలాంటి జంటలు కొన్నిసార్లు పెళ్లి కూడా చేసుకునే వాళ్లు. ఈ రోమన్ల సంప్రదాయం నుంచే వాలెంటైన్స్ డే వచ్చిందని భావిస్తున్నారు.

మనదేశంలో మాత్రం ప్రేమికుల రోజును జరుపుకోవడం 1990వ దశకంలో మొదలు పెట్టారు. మన దేశంలో 1990వ దశంలో ప్రేమ పేరుతో ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే, ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల రోజును జరుపుకుంటున్నా కొన్ని దేశాల్లో మాత్రం దీనిని నిషేధించారు. ముస్లింలు అధికంగా ఉన్న దేశాలైన పాకిస్థాన్‌, సౌదీ అరేబియాలో నిషేధం కొనసాగుతోంది. వాలంటైన్ డే ఇస్లాంకు వ్యతిరేకమని, ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే ఇండోనేషియాలోనూ దీనిపై వ్యతిరేకత పెరుగుతోంది. మన దేశంలోనూ ప్రేమికుల రోజున జంటగా కనిపిస్తే పెళ్లిళ్లు చేస్తామని కొన్ని హిందూ అతివాద సంఘాలు హెచ్చరిస్తున్నాయి. దీని కారణంగా విచ్చలవిడి శృంగారం, మద్యపానం పెరుగుతుందనేది వారి వాదన.




Next Story