టీనేజ్‌లో ప్రేమ.. 60 ఏళ్ల తరువాత పెళ్లి
టీనేజ్‌లో వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలు పెళ్లికి ఒప్పుకోక పోవడంతో విడిపోయారు. 60 ఏళ్ల తరువాత కలుసుకుని పెళ్లి చేసుకున్నారు.
By తోట వంశీ కుమార్ Published on 23 March 2023 11:58 AM IST
ప్రేమించుకున్న 60 ఏళ్ల తరువాత పెళ్లి చేసుకున్న లెన్ ఆల్‌బ్రైటన్, జీనెట్
ప్రేమ.. ఎప్పుడు ఎవరి మధ్య ఎలా ఎందుకు పుడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ప్రేమించుకున్న వారు అంతా పెళ్లిళ్లు చేసుకుంటారు అన్న గ్యారెంటీ ఏమీ లేదు. కొందరు పెద్దలను ఒప్పించి వివాహాలు చేసుకుంటే మరికొందరు పెద్దల మాటలను కాదనలేక విడిపోతుంటారు. అలా విడిపోయిన ఇద్దరు వేరు వేరు వ్యక్తులను పెళ్లి చేసుకున్నారు. పిల్లలను కన్నారు. అయితే.. ప్రేమను మాత్రం మరిచిపోలేదు. జీవిత చరమాంకంలో కలిసి ఉండాలని నిర్ణయించారు. ప్రేమించుకున్న 60 ఏళ్ల తరువాత పెళ్లితో ఒక్కటి అయ్యారు. బ్రిటన్‌లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే.. 1963లో లెన్ ఆల్‌బ్రైటన్ 19 ఏళ్లు కాగా జీనెట్ స్టీర్ కి 18 ఏళ్లు. ఆ సమయంలో వీరిద్దరూ న్యూ పోర్ట్‌లోని సెయింట్ మేరీస్ ఆస్పత్రిలో పని చేస్తున్నారు. తొలి చూపులోనే ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకోవాలని బావించారు. ఈ విషయాన్ని ఇరు కుటుంబాల్లోని పెద్దలకు చెప్పారు. అయితే.. జీనెట్ తల్లిదండ్రులు వీరి పెళ్లికి ఒప్పుకోలేదు.
ప్రేమ వివాహం చేసుకునేందుకు చట్టపరమైన వివాహ వయస్సు అయిన 21 సంవత్సరాలు జీనెట్‌కు లేదు. మూడేళ్లు తక్కువగా ఉన్నాయి. దీంతో చేసేది లేక లెన్ ఆల్‌బ్రైటన్, జీనెట్‌లు విడిపోయారు. ఇద్దరూ వేరు వేరు వ్యక్తులు పెళ్లి చేసుకున్నారు. లెన్ ఆస్ట్రేలియాలో, జీనెట్ ఇంగ్లాండ్‌లో స్థిరపడ్డారు. పిల్లలను కన్నారు.
అయితే.. 60 ఏళ్ల తరువాత అంటే 79 ఏళ్ల వయస్సులో లెన్ ఆల్‌బ్రైటన్ (79) తన ప్రేయసి జీనెట్ స్టీర్ (78)ను వెతుక్కుంటూ ఇంగ్గాండ్ వచ్చాడు. ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. దీనిపై జీనెట్ మాట్లాడుతూ.. వివాహ జీవితం అద్భుతంగా ఉంది. నన్ను గౌరవంగా చూసే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఆనందంగా ఉంది. లెన్‌తో మరోసారి ప్రేమలో పడ్డాను అని మురిసిపోతుంది. ప్రస్తుతం వీరి వివాహం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.