నిజంగా అద్భుత‌మే.. చేతిపై ముక్కును పెంచి.. ముఖానికి అతికించిన ఫ్రాన్స్ వైద్యులు

Surgeons In France Successfully Transplant Nose Grown On Woman's Arm To Her Face.మ‌హిళ చేతిపై ముక్కునుపెంచి విజ‌య‌వంతంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Nov 2022 3:41 AM GMT
నిజంగా అద్భుత‌మే.. చేతిపై ముక్కును పెంచి.. ముఖానికి అతికించిన ఫ్రాన్స్ వైద్యులు

వైద్యులు అద్భుతం చేశారు. ముక్కును కోల్పోయి బాధ‌ప‌డుతున్న ఓ మ‌హిళ చేతిపై ముక్కును పెంచి విజ‌య‌వంతంగా ఆమె ముఖానికి అతికించారు. ఈ ఘ‌ట‌న ప్రాన్స్‌లో జ‌రిగింది.

టౌలౌస్‌కు చెందిన ఓ మ‌హిళ నాసికా కుహరం క్యాన్సర్‌తో బాధ‌ప‌డుతుండ‌గా 2013లో ఆమెకు రేడియోథెరపీ మరియు కీమోథెరపీ చికిత్స అందించారు. చికిత్స కార‌ణంగా ఆమె ముక్కులో చాలా భాగం కోల్పోయింది. ముక్కు లేకుండానే ఆమె గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా జీవిస్తోంది. అయితే..టౌలౌస్ యూనివర్శిటీ హాస్పిటల్ వైద్యుల అద్భుత కృషి వ‌ల్ల ఆమె కొత్త ముక్కును పొంద‌గలిగింది.

మృదులాస్థి స్థానంలో 3D-ప్రింటెడ్ బయోమెటీరియల్‌తో కస్టమ్ ముక్కు ఆమె కోసం తయారు చేశారు. తొలుత దానిని ఆమె చేతికి పెట్టారు. రెండు నెల‌ల కాలంలో దానిపై చ‌ర్మం పెరిగింది. అనంత‌రం దాన్ని క‌ట్ చేసి ముఖానికి ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. మెక్రో సర్జ‌రీ ద్వారా ముఖం వ‌ద్ద ఉండే ర‌క్త‌నాళాల‌ను ఒక్కోదాన్ని 3డీ ముక్కు నాళాల‌తో క‌లుపుతూ ఆప‌రేష‌న్‌ను విజ‌యవంతంగా పూర్తి చేశారు. ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు వెద్యులు తెలిపారు. టౌలౌస్ యూనివ‌ర్సిటీ హ‌స్పిట‌ల్ ఫేస్‌బుక్‌లో ముంజేయిపై పెరుగుతున్న ముక్కు ఫోటోల‌ను షేర్ చేసింది.


ఈవెనింగ్ స్టాండర్డ్ ప్రకారం.. వైద్యులు మైక్రోసర్జరీని ఉపయోగించారు. చేతి చర్మంలోని రక్త నాళాలను మహిళ ముఖంలోని రక్తనాళాలకు అనుసంధానించారు. ఈ చికిత్స త‌రువాత ఆమె 10 రోజుల పాటు వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఆస్ప‌త్రిలో ఉంది. మూడు వారాల యాంటీబ‌యాటిక్స్ త‌రువాత ఆమె ఆరోగ్యంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు.

కాగా.. ఇలాంటి ర‌క‌మైన పునర్నిర్మాణం ఇంతకు ముందెన్నడూ నిర్వ‌హించ‌లేద‌ని ఇదే తొలిసారి అని అన్నారు. ఎముక పునర్నిర్మాణంలో ప్రత్యేకత కలిగిన బెల్జియన్ వైద్య పరికరాల తయారీదారు సెర్హమ్‌తో వైద్య బృందాల సహకారంతోనే ఇది సాధ్య‌మైంద‌న్నారు. ఈ కొత్త టెక్నిక్ ఇతర టెక్నిక్‌ల ద్వారా మున్నుందు మ‌రెన్నో అద్భుతాలు సాధ్యం అవుతాయ‌ని ఆసుపత్రి తెలిపింది.

Next Story