పోలీస్ స్టేషన్ లో హల్దీ వేడుక..

Rajasthan Cops haldi at police station. రాజస్థాన్‌లో ఓ మహిళా పోలీసు కానిస్టేబుల్‌కు హల్దీ వేడుకకు సెలవు దొరక‌లేదు. దీంతో తోటి ఉద్యోగులు పోలీస్ స్టేషన్ ముందే జరిపించారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 April 2021 5:03 AM GMT
haldi function at police station

కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. జీవితంలో ముఖ్యమైన విష‌యాల్లో కొన్ని మధురమైన జ్ఞాపకాలకు కూడా నోచుకోలేక ఆంక్షల మధ్య జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇక అత్యవసర సేవల పరిధిలోకి వచ్చే కొన్ని ప్రభుత్వ శాఖలోని ఉద్యోగులు రాత్రి పగలు అన్నతేడా లేకుండా నిరంతరం కరోనాను కట్టడి చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఓ మహిళా పోలీసు కానిస్టేబుల్‌కు పెళ్ళి కుదిరింది. పెళ్ళికి అయితే సెలవు దొరికింది కానీ.. దానికి ముందు చేసే హల్దీ వేడుకకు సెలవు దొరక‌లేదు. ఈ విష‌యం తెలుసుకున్న తోటీ ఉద్యోగులు.. ఆమె చేస్తున్న స్టేషన్‌ ముందే ఈ తతంగాన్ని జరిపించారు. ఈ ఘ‌ట‌న రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్లో చోటు చేసుకుంది.

వేడుక‌లో భాగంగా కాబోయే వ‌ధువుకు ప‌సుపు రంగు స‌ల్వార్‌, రెడ్ క‌ల‌ర్ దుప‌ట్టాలో అందంగా ముస్తాబ్ చేశారు. ఆ త‌రువాత స్టేష‌న్ ఆవ‌ర‌ణ‌లో ఓ కుర్చీలో కూర్చోబెట్టారు. ఆ పై రాజ‌స్థాని సంప్ర‌దాయ‌ల పాట‌లు పాడుతూ.. ప‌సుపు పూస్తూ.. కుటుంబ స‌భ్యులు ఉంటే ఎలాగా చేస్తారో అచ్చు అలాగే చేశారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

కాగా, కరోనా సెకండ్‌ వేవ్‌, ఫస్ట్‌ వేవ్‌ కంటే బలంగా.. అలాగే దానీ ప్రభావం తీవ్రత కూడా ఎక్కువగానే చూపిస్తోంది. దీంతో దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై, పోలీసులతో పాటు ఫ్రంట్‌లైన్ కార్మికులపై పని ఒత్తిడి తీవ్రంగానే పెరిగిందని చెప్పాలి. కేసుల పెరుగుదల కట్టడి కోసం శుక్రవారం రాజస్తాన్ ప్రభుత్వం ఆంక్షలను విధించింది.


Next Story