ఓ అమ్మాయి.. నలుగురు అబ్బాయిలతో ప్రేమ.. లక్కీడ్రా తీసిన పెద్దలు
Panchayat in Rampur holds 'lucky draw' to select a groom for a girl who eloped with four men. ఓ యువతి నలుగురు యువకులను ప్రేమించింది, ఊరి పెద్దలు లక్కీ డ్రా తీసి అందులో ఒకరితో ఆ యువతికి వివాహం జరిపించారు.
By తోట వంశీ కుమార్ Published on 6 March 2021 12:18 PM IST
స్వయం వరం నిర్వహించి అందులో గెలిచిన యువకుడికి యువరాణిని ఇచ్చి వివాహాం చేసేవారట పూర్వ కాలంలో. ప్రస్తుతం కంప్యూటర్ యుగంలో ఇంచుమించు అలాంటి ఘటననే జరిగింది. ఓ యువతి నలుగురు యువకులను ప్రేమించింది. వారితో కలిసి ఇల్లు విడిచి వెళ్లిపోయింది. పెద్దలు వారిని తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. ఆ నలుగురులో ఒకరితో వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఎవరి పెళ్లి చేసుకుంటావ్ అని ఆ యువతిని అడుగగా.. ఎటూ తేల్చుకోలేకపోయింది. నలుగురి ప్రేమిస్తున్నట్లు చెప్పింది. రెండు మూడు రోజులు చర్చల అనంతరం ఆ ఊరి పెద్దలు లక్కీ డ్రా తీసి అందులో ఒకరితో ఆ యువతికి వివాహం జరిపించారు. ఈ విచిత్రమైన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. రాంపూర్ జిల్లాలోని అంబేడ్కర్ నగర్‌లోని అజీమ్ నగర్ చెందిన ఓ యువతిని నలుగురు యువకులు ప్రేమిస్తున్నారు. మరీ ఆయువతికి ఎవరిని బాధపెట్టడం ఇష్టం లేదు ఎమో గానీ.. ఆ నలుగురినీ ప్రేమించింది. ఈ 'చతుర్ముఖ ప్రేమాయణం' కొంతకాలం సాగింది. కానీ ఆ అమ్మాయి నాదంటే నాదని నలుగురు గొడవకు దిగారు. నా ప్రేమ గొప్పదంటే నా ప్రేమ గొప్పదని వాదులాడుకున్నారు. ఆ అమ్మాయిని నలుగురు అబ్బాయిలు కలిసి ఎత్తుకెళ్లి వేరే ఊరిలో దాచిఉంచారు. ఆమెను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా ఏం కావాలో అన్నీ అమర్చిపెట్టారు.
ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు వారిని తిరిగి ఊరికి తీసుకొచ్చి నలుగురు యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని బావించగా.. ఊరి పెద్దలు పోలీసు కేసు పెట్టవద్దని పంచాయతీలో కూర్చొని పరిష్కరించుకుందామని చెప్పారు. దీంతో ఊరి పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. ఎత్తుకెళ్లిన అబ్బాయిల్లో ఒకరితో ఆ అమ్మాయి వివాహం చేసేద్దామని తండ్రిని సముదాయించారు. అమ్మాయిని పిలిచి ఆ నలుగురిలో ఎవరు నీకు ఇష్టమో చెబితే.. అతడినే నీకు ఇచ్చి వివాహం చేస్తామని చెప్పారు. అయితే.. ఆ అమ్మాయి ఎటూ తేల్చుకోలేకపోయింది. నలుగురు ఇష్టమేనని చెప్పింది. ఆ నలుగురు అబ్బాయిలను పిలిచి.. మీలో మీరు చర్చించుకుని.. మీ నలుగురు కలిసి మీలో ఒకరిని నిర్ణయిస్తే అతడికి ఇచ్చి ఆ యువతిని పెళ్లి చేస్తామని చెప్పారు.
దీనికి నలుగురు యువకులు ఒప్పుకోలేదు. ఆ అమ్మాయిని నేనే చేసుకుంటానంటే కాదు నేనే చేసుకుంటానని మరోసారి వాదులాటలు మొదలు పెట్టారు. దీంతో ఏం చేయాలో అక్కడ ఉన్న వారికి పాలుపోలేదు. ఇలా రెండు మూడు రోజులు గడిచాయి. రోజులు గడుస్తున్నా సమస్యకి పరిష్కారం రావడం లేదు. దీంతో గ్రామ పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చారు. చిట్టీలపై నలుగురు యువకుల పేర్లు రాసి.. చిన్నారితో లక్కీ డ్రా తీయించారు. ఆ చీటిలో పేరున్న వ్యక్తితోనే ఆ యువతికి త్వరలో వివాహం చేయనున్నారు.