మత్స్యకారుడిని లక్షాధికారిని చేసిన చేప

Pakistani fisherman becomes millionaire overnight.అదృష్టం ఎవ‌రి తలుపు ఎప్పుడు త‌డుతుందో చెప్ప‌లేము. అదృష్టం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Jun 2021 7:32 AM GMT
మత్స్యకారుడిని లక్షాధికారిని చేసిన చేప

అదృష్టం ఎవ‌రి తలుపు ఎప్పుడు త‌డుతుందో చెప్ప‌లేము. అదృష్టం త‌లుపు త‌డితే.. ఒక్క రోజులోనే అత‌డి జీవితం మారిపోతుంది. ఓ మ‌త్స్య‌కారుడి వ‌ల‌లో ఓ చేప చిక్కింది. దీంతో అత‌డి జీవిత‌మే మారిపోయింది. ఆ చేప అత‌డిని ల‌క్షాధికారిని చేసింది. అత‌డు ప‌ట్టింది మామూలు చేప కాదు అరుదైన అల్లాంటిక్ క్రోక‌ర్ జాతికి చెందిన‌ది.

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని గ్వాదర్‌ తీరప్రాంతంలో సాజిద్‌ హాజీ అబాబాకర్ అనే మ‌త్స్య‌కారుడు త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తున్నాడు. సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టడం, అవి అమ్మడ‌మే అదే అతడి జీవనాధారం. అయితే.. ఓ చేప అత‌డి జీవితాన్నే మార్చేసింది. అరుదైన అట్లాంటిక్ క్రోక‌ర్ జాతికి చెందిన‌ది చేప అది. 48 కేజీల బరువైన ఈ చేప వేలంలో ఏకంగా రూ.72 లక్షల ధర పలికింది. యూరప్‌, చైనాల్లో ఈ క్రోకర్‌ జాతి చేపలకు ఫుల్ డిమాండ్‌ ఉంది.

సాధార‌ణంగా చేపల విలువ వాటి మాంసాన్ని బ‌ట్టి ఉంటుంది. అయితే.. క్రోకర్‌ జాతి చేప విషయం వేరు. వైద్యపరంగా ఈ చేపలకు అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ డిమాండ్‌ ఉంది. దీని చర్మాన్ని, ఎముకలను ఔషధాల్లో, ఇతర వైద్యపరమైన అంశాల్లో వాడతారు. అందుకే దీనికి అంత ధర. నిజానికి వేలంలో ధర ఇంకా ఎక్కువే పలికింది. రూ 86.4 లక్షల వరకు వెళ్లింది. అయితే అంత ధరకు చేజిక్కించుకున్నవారికి రాయితీ ఇవ్వడం స్థానికంగా సంప్రదాయం. అందుకే అధికారులు చివరికి రూ.72 లక్షలుగా ధరను ఖరారు చేశారు.


Next Story