ప్రస్తుతం టమాటా పేరు చెప్పితే చాలు జనం హడలిపోతున్నారు. దేశంలో టమాటా ధర కొండెక్కడమే ఇందుకు కారణం. రూ.80 నుంచి 100 పలుకుతోంది. దీంతో మధ్యతరగతి ప్రజలు టమాటా వాడకాన్ని తగ్గించేశారు. ఒకప్పుడు కిలోల కొద్దికొనే టమాటాను ప్రస్తుతం అర్థకిలో, పాలోకిలో చొప్పున కొంటున్నారు. ఇక తమిళనాడు రాష్ట్రంలో అయితే.. కిలో టమాటా కంటే లీటరు పెట్రోలే తక్కువకు వస్తుంది. చెన్నైలో ప్రస్తుతం కిలో టమాట ధర రూ.150 పలుకుతోంది. దీంతో ప్రజలు టమాటాలు కొనేందుకు జంకుతున్నారు.
పెరిగిన టమాటా ధరను తన బిజినెస్‌కు బాగా ఉపయోగించుకుంటున్నారు చెన్నైలోని ఓ బిర్యానీ సెంటర్ వారు. ఓ వినూత్న ఆఫర్‌తో కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. అతడి ఐడియా ఫలించి.. జనం క్యూ కడుతున్నారు అక్కడికి. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటంటే..? ఒక కిలో టమాటాలు తీసుకొస్తే.. అందుకు బదులుగా ఒక కిలో బిర్యానీని ఉచితం, రెండు కిలోల బిర్యానీ కొన్నవారికి అరకేజీ టమాటాలు ఉచితం అంటూ.. చెన్నై శివార్లలో ఉన్న అంబూర్ బిర్యానీ సెంటర్ నిర్వాహకులు ఆఫర్ ప్రకటించారు.
వర్షాలతో అల్లాడిన చెన్నైలో ప్రస్తుతం కూరగాయల ధరలు ఆకాశాన్నంటున్నాయి. అంబూర్ బిర్యానీ షాప్‌లో ఒక కేజీ బిర్యానీ వంద రూపాయిలు మాత్రమే కావడంతో బిర్యానీ కోసం భోజన ప్రియులు ఎగబడుతున్నారు. దీంతో అంబూర్ బిర్యానీ యజమాని పంట పండింది. బిర్యానీకీ బాగా గిరాకీ పెరిగింది.