దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ మహమ్మారి బారి నుంచి రక్షించుకోవడానికి భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లు వాడడం, మాస్క్‌లు ధరించాలని ప్రభుత్వాలు పదే పదే చెబుతున్నాయి. మాస్క్ పెట్టుకుంటే.. నీవు కరోనా బారిన పడకుండా తప్పించుకోవడంతో పాటు.. నీ నుంచి ఇతరులు కరోనా బారిన పడకుండా ఉంటారని చెబుతున్నప్పటికి.. కొందరు మాత్రం ఆ మాటలను పెడచెవిన పెడుతున్నారు. మాస్క్ లేకుండానే బయటకు వస్తున్నారు.
కాగా.. ఇప్పటి వరకు మనం చాలా రకాల మాస్కులను చూశాం. అయితే.. ఈ తాత పెట్టుకున్న మాస్క్ మాత్రం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకూ ఆ తాత ఏదో డిజైన్ మాస్క్ పెట్టుకున్నాడనుకుంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే.. ఆ తాత పిట్టగూడునే మాస్క్‌గా పెట్టుకున్నాడు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం చిన్నమునగల్‌చేడ్‌కు చెందిన కుర్మన్న అనే ఈ తాత మేకలను కాస్తుంటాడు. ఓ చేనులో కనపడిన పిట్టగూడునే మాస్క్ గా మార్చుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ మారాయి.