ఘోర అవ‌మానం.. మిసెస్‌ శ్రీలంకకు అందాల పోటీ వేదిక మీద‌నే .. ఏం జ‌రిగిందంటే..?

Mrs Sri Lanka' beauty contest ends with onstage drama.శ్రీలంక‌లో మిసెస్‌ శ్రీలంక వరల్డ్‌, మాజీ మిసెస్‌ శ్రీలంక పుష్పికా డిసిల్వా త‌ల‌పైనున్న కిరీటాన్ని లాగిపడేశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 April 2021 11:32 AM GMT
Mrs Srilanka

శ్రీలంక‌లో జ‌రిగిన అంద‌గ‌త్తెల‌ పోటీ వివాదానికి తెర‌లేపింది. భ‌ర్త‌తో విడాకులు తీసుకున్న కార‌ణాన్ని చూపుతూ.. మిసెస్‌ శ్రీలంక వరల్డ్‌, మాజీ మిసెస్‌ శ్రీలంక పుష్పికా డిసిల్వా త‌ల‌పైనున్న కిరీటాన్ని లాగిపడేశారు. దీంతో స్టేజ్ మీదే ఆమె గాయ‌ప‌డింది. అవ‌మాన భారంతో వెంట‌నే స్టేజీ మీది నుంచి వెళ్లిపోయింది. వివ‌రాల్లోకి వెళితే.. ఆదివారం జ‌రిగిన అందాల పోటీ పైన‌ల్‌లో శ్రీమ‌తి పుష్పిక డి సిల్వా నిలిచిన‌ట్లు తొలుత ప్ర‌క‌టించారు. దీంతో ఆమె త‌న ఆనందాన్ని స్టేజీ మీద ఉన్న అంద‌రితో పంచుకుంది. స‌రిగ్గా ఈ స‌మ‌యంలోనే2019 మిసెస్ శ్రీలంక విజేత క‌రోలినా జూరీ స్టేజ్‌పై అనుచితంగా వ్య‌వ‌హ‌రించింది.

పుష్పికా డిసిల్వా త‌ల‌పై నుంచి కిరీటాన్ని లాగిప‌డేసింది. అనంత‌రం ప‌క్క‌నే ఉన్న మొద‌టి ర‌న్న‌ర‌ప్‌ బ్యూటీ కిరీటాన్ని తొడిగింది. పుష్పికా త‌ల‌పై నుంచి కిరీటాన్ని తీసే క్ర‌మంలో ఆమె జ‌ట్టు మొత్తం చెదిరిపోయింది. అయితే మిసెస్ శ్రీలంక అవార్డును కేవ‌లం పెళ్లి అయిన మ‌హిళ‌ల‌కే ఇస్తార‌ని, కానీ విడాకులు తీసుకున్న‌వారికి కాదు అని క‌రోలినా ఆ స్టేజ్ మీదే పేర్కొన్న‌ది. దీంతో త‌నకు జ‌రిగిన అవ‌మానంతో పుష్పికా వెంట‌నే స్టేజీ దిగి కింద‌కు వెళ్లి పోయింది. ఈ వివాదంపై పుష్పిక త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో స్పందించింది. తాను విడాకులు తీసుకోలేద‌ని, ఒక‌వేళ విడాకులు తీసుకుంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వాల‌ని పుష్పిక డిమాండ్ చేసింది.ఈ వివాదం పెద్ద‌దిగా మారుతుండ‌డంతో వెంట‌నే నిర్వాహ‌కులు రంగంలోకి దిగి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన మిసెస్‌ శ్రీలంక వరల్డ్‌ నేషనల్‌ డైరెక్టర్‌ చండీమాల్‌ జయసింఘే, తొలుత విజేతగా ప్రకటించిన మహిళకే కిరీటం దక్కుతుందని స్పష్టం చేయడంతో వివాదం సద్దుమణిగింది.
Next Story