ఎలక్షన్లలో పోటీ చేయడం కోసం ఒక్కొక్కరు ఒక్కో ఎత్తు వేస్తారు. సీటు సంపాదించుకోవడం కోసం రకరకాల ప్రయత్నం చేస్తారు.పంచాయతీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి హడావిడిగా పెళ్లిపీటలు ఎక్కేసాడు. ఎన్నికలకూ, పెళ్లికి సంబంధం ఏమిటంటారా?.. చదవండి మరి..

బల్లియా జిల్లా కరణ్ ఛాప్రా గ్రామానికి చెందిన 45 ఏళ్ల హాథీ సింగ్ ఓ దశాబ్దంగా సామాజిక సేవ చేస్తున్నాడు. గ్రామపెద్ద కావాలన్నదే అతని చిరకాల కోరిక. 2015లో తన అదృష్టం పరీక్షించుకునేందుకు పంచాయతీ ఎన్నికల్లో తన గ్రామం నుంచి నిలబడ్డాడు. అయితే రన్నరప్‌గానే మిగిలిపోయాడు. ఎప్పటికైనా తన కోరిక నెరవేరుతుందని ఆశించిన హధీ సింగ్‌కు ఈ మధ్య ఊహించని విధంగా ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పోటీ చేయాలనుకుంటున్న సీటును మహిళలకు రిజర్వ్ చేశారు. దీంతో ఎలాగైనా ఈసారి ఎన్నికల్లో గెలవాలన్న అతని ఆశలు చెల్లచెదురయ్యాయి.

ఒక్కసారిగా నిరుత్సాహం వచ్చేసింది అలాంటప్పుడు మిత్రులంతా కలిసి హాతీకి పెళ్లి ప్రతిపాదన చేశారు. మాములుగా పెళ్లంటే పెద్దగా శ్రద్ధ చూపని హాతీ సింగ్ ఈసారి వెంటనే ఒప్పేసుకున్నాడు ఎందుకంటే పెళ్లి చేసుకుంటే ఆమెను ఎన్నికల్లోకి దించవచ్చు కదా.. వెంటనే పెళ్లి పీటలు ఎక్కేశాడు. ఈనెల 26న తన గ్రామంలోని థర్మనాథ్‌జీ ఆలయంలో బాజాభజంత్రీలు మోగాయి. నిజానికి హిందూ సంప్రదాయం ప్రకారం ఖర్-మాస్లో పెళ్లి శుభప్రదం కాదు. ఇవేమీ తన లక్ష్యానికి అడ్డుకావని హాధీ సింగ్ చెప్పాడు.

ఏప్రిల్ 13న నామినేషన్ల గడువు పూర్తయ్యే లోగానే తాను పెళ్లి చేసుకోవాలనుకున్నానని . అందుకే చేసేసుకున్నానంటున్నాడు హాథి సింగ్. శ్రీమతి హాథీ సింగ్ ప్రస్తుతం గ్యాడ్యుయేషన్ చదువుతోంది. భర్త కోరిక మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీకి సై అంటోంది. కల్యాణ ఘడియ వస్తే ఆగదంటారు. దానికి ఇదొక ఉదాహరణ మాత్రమే..


తోట‌ వంశీ కుమార్‌

Next Story