నేను హెల్మెట్ పెట్టుకోలేద‌న‌డానికి ఆధారం ఏదీ..? అంటూ ప్ర‌శ్నించిన యువ‌కుడికి దిమ్మ‌తిరిగే రిప్లై

Man's challenge to Bengaluru traffic police to show evidence of him not wearing helmet backfires.ట్రాఫిక్ పోలీసులు తీసిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Oct 2022 9:42 AM IST
నేను హెల్మెట్ పెట్టుకోలేద‌న‌డానికి ఆధారం ఏదీ..?  అంటూ ప్ర‌శ్నించిన యువ‌కుడికి దిమ్మ‌తిరిగే రిప్లై

ఎప్పుడైనా స‌రే ట్రాఫిక్ ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డితే ట్రాఫిక్ పోలీసులు చలానా(ఫైన్‌) వేస్తుంటారు. అలా ప‌డిన చ‌లానాలు క‌ట్టేసి మ‌రోసారి ఆ త‌ప్పు జ‌ర‌గ‌కుండా చూసుకుంటుంటాం. ఒక‌వేళ ట్రాఫిక్ పోలీసులు విధించిన చ‌లానా త‌ప్పు అయితే.. వారి దృష్టికి తీసుకువెళ్లి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకుంటాం. అయితే.. ఓ యువ‌కుడు తప్పు త‌న‌దే అయినా.. తన తెలివి తేట‌ల‌తో చ‌లానా క‌ట్ట‌కుండా ఉండేందుకు ట్రాఫిక్ పోలీసుల‌నే ద‌బాయించే ప్ర‌యత్నం చేశాడు. ట్రాఫిక్ పోలీసులు తీసిన ఫోటోలో బండి నంబ‌ర్ మాత్ర‌మే క‌నిపిస్తుండ‌డంతో త‌ను హెల్మెట్ పెట్టుకోలేదు అన‌డానికి ఎలాంటి ఆధారాలు లేవంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ర‌చ్చ చేయ‌బోయాడు. అత‌డు చేసిన ట్వీట్‌కు కొద్ది స‌మ‌యంలోనే ట్రాఫిక్ పోలీసులు స్పందించ‌డంతో చేసేది లేక మొద‌ట పెట్టిన ట్వీట్‌ను డిలీట్ చేసి చ‌ల్ల‌గా జారుకున్నారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ వైర‌ల్‌గా మారింది.

బెంగ‌ళూరు చెందిన ఫెలిక్స్ రాజ్(ట్విట్టర్ ఖాతా పేరు) అనే యువ‌కుడు ఇటీవ‌ల ద్విచ‌క్ర‌వాహ‌నంపై వెలుతుండ‌గా.. హెల్మెట్ లేక‌పోవ‌డంతో ట్రాఫిక్ పోలీసులు చ‌లానా వేశారు. అయితే.. ఆ యువ‌కుడు త‌న‌కు విధించిన చ‌లానా ఫోటోను ట్వీట్ట‌ర్‌లో షేర్ చేస్తూ.. స్కూట‌ర్, నంబ‌ర్ ప్లేట్ ఉన్న ఫోటోతో నాకు చ‌లానా అందింది. అయితే.. ఇందులో హెల్మెట్ లేకుండా ప్ర‌యాణిస్తున్న‌ట్లు ఎలాంటి ఆధార‌ము లేదు. కాబ‌ట్టి పూర్తి ఫోటో అయినా పంపండి లేదంటే.. చ‌లానాను ర‌ద్దు చేయండి. గతంలో ఇలాగే వ‌చ్చినా చ‌లానా చెల్లించా.. అయితే.. ఈ సారి మాత్రంక‌ట్టేదేలే అంటూ బెంగ‌ళూరు ట్రాఫిక్ పోలీసుల‌ను ట్యాగ్ చేశాడు.

ఈ ట్వీట్‌కు బెంగ‌ళూరు ట్రాఫిక్ పోలీసులు క్ష‌ణాల్లోనే రిప్లై ఇచ్చారు. యువ‌కుడు హెల్మెట్ లేకుండా వాహ‌నాన్ని న‌డుపుతున్న పూర్తి ఫోటోను ట్వీట్ చేశారు. దీనిపై మ‌ళ్లీ ఆ యువ‌కుడు స్పందిస్తూ.. ఆధారాన్ని చూపించినందుకు ధ‌న్య‌వాదాలు. ఓ పౌరుడిగా త‌న‌కు తెలుసుకునే హ‌క్కు ఉంద‌ని, త‌న డౌట్‌ను క్లారిఫై చేసినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ చ‌లానా క‌ట్టేస్తా అంటూ ట్వీట్ చేశాడు. అనంత‌రం మొద‌ట చేసిన ట్వీట్‌ను డిలీట్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మార‌గా.. నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

Next Story