ప్రేమ పుట్టడం సహజం. ఆ ప్రేమను వ్యక్తపరిచేందుకు ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటుంటారు. కొందరు మోకాళ్ల పై కూర్చోని రోజా పువ్వులతో తమ ప్రేమను వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు ప్రేమలేఖలు, సోషల్ మీడియాలో తమ ప్రేమను తెలియజేస్తుంటారు. అయితే.. అందరిలా చేస్తే ఏం మజా ఉంటుందని అనుకున్నాడో.. వెరైటీగా చేయాలని బావించాడో ఏమోగాని ఓ యువకుడు ఏకంగా రోడ్డుపైనే తన ప్రేమను తెలియజేస్తూ.. ప్రేమ కవితలు రాసేసాడు. ఇలా కొద్ది దూరం రాసాడో అనుకుంటే పప్పులో కాలేసినట్లే ఏకంగా 2.5కిలోమీటర్ల పొడవునా రాశాడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లోని రహదారిపై ఓ కుర్రాడు 2.5 కిలోమీటర్ల పొడవున తన గుండెలో ప్రేయసి అంటే ఎంత ప్రేమో తెలుపుతూ కవితలు రాశాడు. 'ఐ లవ్యూ', 'ఐ మిస్ యూ' మాటలతో రోడ్డును నింపేశాడు. వీటిలో ఒక మెసేజిలో 'మిస్ యూ. జిందగీ కే సాత్, జిందగీ కే బాద్ భీ' అంటూ కవితలు అల్లాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఈ ప్రేమ కవితలను పెయింట్‌తో కప్పేసే పనిలో ఉన్నారు.