మనలో కొంత మందికి పాము చూస్తే చాలు భయంతో దూరంగా పరిగెడుతారు. మరికొందరు అయితే.. కర్రతో అందుకొని దాని ఊపిరి తీసేవాళ్లుంటారు. అయితే.. ఓ వ్యక్తి మాత్రం ప్రాణాపాయ స్థితిలో ఉన్న నాగుపాము(కోబ్రా)కు నోటితో ఆక్సిజన్ అందించి దాని ప్రాణాలు రక్షించాడు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లాలోని నువాగూడ షాహీలో ఓ వ్యక్తి ఇంట్లోకి నాగుపాము కనబడింది. దీంతో అతడు వెంటనే స్నేక్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాడు.
వెంటనే సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. కదలేని స్థితిలో ఆ పాము ఉన్నట్లు గుర్తించారు. సొమ్మసిల్లిపోయి ఉన్న స్థితిలో ఉన్న ఆ కోబ్రాను చూసిన స్నేహాశీష్ అనే హెల్ప్ లైన్ మెంబర్.. వెంటనే ఓ చిన్న పైపు తీసుకున్నాడు. ఆ పైపు ఓ కొనను పాము నోటిలో పెట్టి మరో కొనను తన నోటితో పెట్టుకుని గాలి ఊదాడు. అతడు చేసిన పనితో.. కొద్దిసేపటికే ఆ పాములో చలనం కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సరైన సమయంలో స్పందించి పాము ప్రాణాలను కాపాడిన స్నేహాశీష్‌పై నెటీజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.