ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది తినడానికి తిండి లేక ఆకలి బాధతో మరణిస్తుంటే మరికొందరు మాత్రం ఆహారాన్ని వృథా చేస్తున్నారు. ఇలా ఆహారాన్ని వృథా చేసే వారు ఒక్కసారి ఈ సెక్యూరిటీ గార్డు లంచ్ బాక్స్‌ను చూడండి. కనీసం అప్పటికైనా ఆహారం విలువు తెలుసుకుంటారేమో..! మలేషియాకు చెందిప అపిత్ లిడ్ అనే ఓ ఫేస్‌బుక్ యూజర్ తన అకౌంటర్‌లో ఓ ఫోటోను పోస్టు చేశాడు. అందులో సెక్యూరిటీ గార్డు భోజనం చేయడానికి సిద్దంగా ఉన్నాడు. అతడి లంచ్ బాక్స్‌లో నీటితో కలిపిన అన్నం.. ఓ ఉల్లిపాయ.. మూడు వెల్లుల్లి పాయలు మాత్రమే ఉన్నాయి.
అపిత్ లిడ్ ఆ ఫోటో కింద.. "ఈ ఫోటో ఉన్న వ్యక్తి నా స్నేహితుడు. ఇతడు చాలా కష్టపడి పనిచేస్తాడు. కుటుంబానికి దూరంగా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. తనకు వచ్చే జీతంలో అధిక భాగం కుటుంబ అవసరాల కోసం పంపిస్తాడు. చాలా తక్కువ మొత్తాన్ని అతని దగ్గర ఉంచుకుంటాడు. అలా తాను ఉంచుకున్న మొత్తంలో ఇలా భోజనాన్ని చేస్తాడు. దాదాపు ప్రతి రోజు ఇతడు ఇలాగే భోజనం చేస్తాడు. ఇది లేదు అది లేదు అని ఎప్పుడు అడిగింది లేదు. తాను చేసే భోజనాన్ని అతడు ప్రేమిస్తాడు.." అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'ఉన్నంతలో సర్దుకుపోతున్నా నీ మంచితనానికి సెల్యూట్' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా..' ఆహారం విలువ తెలుసుకోండి. మీరు వృధా చేసే ఆహారం ఎంతో మంది కడుపులు నింపుతుంది. దయచేసి ఆహారాన్ని వృధా చేయొద్దు 'అంటూ కామెంట్లు చేస్తున్నారు.