కాకి పిల్ల కాకికి ముద్దు.. కానీ ఆమెకు కాకి అంటేనే ముద్దు?
Khammam Woman Love on Crows. మాములుగా మన సామెతలలో కాకి పిల్ల కాకికి ముద్దు అనడం వింటూ ఉంటాం. కానీ ఆమెకు కాకి అంటేనే ముద్దు.
By Medi Samrat Published on 21 Jan 2021 3:36 AM GMTమాములుగా మన సామెతలలో కాకి పిల్ల కాకికి ముద్దు అనడం వింటూ ఉంటాం. కాకి అంటే ఓ అశుభంగా పరిగణిస్తారు. కాకి ఇంట్లోకి వస్తే శని వచ్చిందని భావించి ఇంట్లో శాంతి హోమం నిర్వహిస్తారు. కాకి ఇంటి ముందు అరిస్తే ఇంటికి ఏదో అశుభం జరుగుతుందని భావిస్తూ ఉంటారు. కానీ ఇలాంటివన్నీ కేవలం అపోహలు మాత్రమేనని కొట్టిపారేశారు ఖమ్మం జిల్లా నెహ్రూ నగర్ కు చెందిన మీనా. మీనా కాకి పిల్లలను ఎంతో అపురూపంగా చూసుకుంటూ కాకిపిల్ల మనిషికి కూడా ముద్దు అని నిరూపించారు. పూర్తి వివరాలలోకి వెళితే..
నెహ్రూ నగర్ లో నివాసముంటున్న మీనా ఇంటిముందు రెండేళ్ల క్రితం ఓ విద్యుత్ స్తంభం పై కాకి గుడ్లు పెట్టి పిల్లల్ని చేసింది. అయితే ప్రమాదవశాత్తు కాకి చనిపోగా కరెంటు స్తంభం పైనుంచి కాకి పిల్లలు కింద పడిపోయాయి. ఇది గమనించిన మీనా ఆ కాకి పిల్లలను చేరదీసి వాటిని జాగ్రత్తగా చూసుకుంది. అయితే కొద్ది రోజులకు రెక్కలు రాగానే రెండు కాకి పిల్లలు ఎగిరిపోయాయి. మిగిలిన ఒక కాకి పిల్లకు "వాణి" అనే నామకరణం చేసింది. ఆ కాకి పిల్లను ఎంతో అపురూపంగా చూసుకుంటుంది. మీనా ఏం చెప్పినా ఆ కాకి చక్కగా వింటుంది.
ఆ కాకి మీనా వంట చేస్తున్నప్పుడు తన పక్కనే ఉంటుంది. ఖాళీ సమయంలో తన ఒళ్లో కూర్చుంటుంది. పూజ గదిలో ఉన్న దేవుడు ఫోటోలకు పూలు వేస్తుంది. వాణి అని పిలవగానే ఇంటిలో ఏ గదిలో ఉన్న వెంటనే మీనా దగ్గరకు చేరుకుంటుంది. తనకు ఆకలి వేస్తే మాత్రం అరిచి గోల చేస్తుంది. ఈ విధంగా కాకి పై మీనా ఎంతో ఆప్యాయతను చూపిస్తూ ఉండి అందరి మూఢనమ్మకాలు నిజం కాదని కేవలం అపోహ మాత్రమేనని రుజువు చేసింది. అంతేకాకుండా కాకి మీనా పై చూపిస్తున్న అభిమానానికి పక్షులు కూడా మనుషులను ప్రేమిస్తాయని ఋజువైంది.