రూ.12ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసి కుక్కలా మారిన జపాన్ వాసి.. వీడియో వైర‌ల్‌

Japanese man spends over Rs 12 lakh to turn into a dog.పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అంటుంటారు. కొంద‌రి కోరిక‌లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 May 2022 12:09 PM IST
రూ.12ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసి కుక్కలా మారిన జపాన్ వాసి.. వీడియో వైర‌ల్‌

పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అంటుంటారు. కొంద‌రి కోరిక‌లు చూస్తుంటే విచిత్రంగా అనిపించ‌క మాన‌దు. ఓ వ్య‌క్తి కుక్క‌లా క‌నిపించాల‌ని క‌ల‌లు క‌న్నాడు. అందుకోసం ఏకంగా రూ.12 ల‌క్షలు ఖ‌ర్చు చేసి మ‌రీ శున‌కంలా మారిపోయాడు. నమ్మడానికి కాస్తంత ఆశ్చ‌ర్యంగా అనిపించినా ఇది నిజంగా నిజం. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. వీటిని చూసిన నెటీజ‌న్లు సంబ్ర‌మాశ్చ‌ర్యాల‌కు లోన‌వుతున్నారు.

జ‌పాన్‌కు చెందిన ప్ర‌ముఖ వార్తా ఏజెన్సీ న్యూస్‌.మైన‌వి వెలండిచిన వివ‌రాల మేర‌కు.. సినిమాలు, వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు, వినోద సౌక‌ర్యాలు లాంటి త‌దితర అవ‌స‌రాల కోసం పెద్ద ఎత్తున వాటికి కావాల్సి న శిల్పాల‌ను, త‌యారు చేస్తుంటుంది జెప్పెట్ సంస్థ‌. తాను శున‌కంగా క‌నిపించాల‌నే ఆలోచ‌న‌తో ఉన్న టోకో ఇవీ అనే వ్య‌క్తి ఈ సంస్థ గురించి తెలుసుకుని వారిని సంప్ర‌దించాడు. త‌న కోరిక‌ను వారికి తెలియ‌జేశాడు. ఇందుకోసం ఎంత ఖ‌ర్చైనా భ‌రిస్తాన‌ని చెప్పాడు. అత‌డి కోరిక‌ను అర్థం చేసుకున్న స‌ద‌రు సంస్థ అత‌డి కోరిక‌ను నెర‌వేర్చేందుకు ముందుకు వ‌చ్చింది.

జెప్పెట్ సంస్థకు చెందిన కళాకారులు దాదాపు 40 రోజులు ఎంతో కష్టపడి టోకో ఇవీకి శునకంలా కనిపించేందుకు కావల్సిన దుస్తులను తయారు చేశారు. మొత్తానికి అత‌డిని టోకోను కోలీ జాతికి చెందిన శునకంగా మార్చేశారు. మేకప్, ఇతర ఖర్చుల నిమిత్తం టోకో 2 మిలియన్ యెన్‌లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 12 లక్షలు) చెల్లించాడ‌ట‌. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను ట్విట్ట‌ర్‌లో, ఓ వీడియోను యూట్యూబ్ ఛాన‌ల్‌లో అత‌డు పంచుకున్నాడు. అయితే.. శున‌కంలా మారిన అత‌డు ఎన్ని రోజులు ఈ అవ‌తారంలో ఉంటాన‌న్న విష‌యాన్ని తెలియ‌జేయ‌లేదు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఇవి వైర‌ల్‌గా మారాయి

.


Next Story