'మా భార్య కనిపించట్లేదు'.. పోలీసులకు 12 మంది యువకుల ఫిర్యాదు

జమ్మూ కాశ్మీర్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. వివిధ ప్రాంతాల్లో తమ భార్య కనిపించడం లేదని 12 మంది యువకులు పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కారు.

By అంజి  Published on  16 July 2023 11:16 AM IST
Woman cheating, marries 27 men, Jammu And Kashmir, budgam

'మా భార్య కనిపించట్లేదు'.. పోలీసులకు 12 మంది యువకుల ఫిర్యాదు

జమ్మూ కాశ్మీర్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. వివిధ ప్రాంతాల్లో తమ భార్య కనిపించడం లేదని 12 మంది యువకులు పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కారు. అయితే ఆ యువకులు ఇచ్చిన ఫొటోలను చూసి పోలీసులు కంగుతిన్నారు. ఆ 12 మంది యువకులు ఇచ్చిన ఫొటోల్లో ఉంది ఒకే మహిళ అని తెలియడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. దీనిపై పోలీసులు పూర్తిగా ఆరా తీశారు. దీంతో అందరూ యువకులు చెప్పిన కథ ఒకేలా ఉంది. బ్రోకర్‌ ద్వారా పెళ్లి చేసుకోవడం, కొన్ని రోజులు కాపురం చేసి ఊడాయించడం ఇలా.. ఒకరిద్దరు కాదు ఏకంగా 27 మందిని ఆ మహిళ పెళ్లాడిందని పోలీసుల విచారణలో తేలింది. అందులో 12 మంది మాత్రమే పోలీసుల దాకా వచ్చారు. మిగతా బాధితులు ఫిర్యాదు చేయలేదు. జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గాం జిల్లాకు చెందిన ఓ మహిళ 27 మంది పురుషులను మోసం చేసి పెళ్లి చేసుకుని, వారి నగలు, నగదు, వస్తువులతో పరారైంది.

మహిళ సుమారు 10-20 రోజుల పాటు పెళ్లి చేసుకున్న పురుషులతో ఉండి, తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లే నెపంతో ఊడాయించేది. బుద్గాం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన శారీరక అనారోగ్యంతో ఉన్న తన కొడుకుకు పెళ్లి చేసేందుకు ఓ మధ్యవర్తిని ఆశ్రయించాడు. అతడు రూ.2 లక్షలు ఇస్తే పెళ్లి సంబంధం కుదురుస్తానని చెప్పాడు. దీంతో అతడితో ఒప్పందం చేసుకుని పెళ్లి ఖాయం చేసుకున్నారు. పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో పెళ్లి కూతురుకు ప్రమాదం జరిగిందంటూ మధ్యవర్తి చెప్పాడని, తాము ఇచ్చిన డబ్బులో సగం తిరిగి ఇచ్చాడని సదరు వ్యక్తి చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత మరో యువతి ఫొటో చూపించి, పెళ్లి కుదిర్చాడని.. ఈ క్రమంలోనే పెళ్లి సమయంలో వధువుకు రూ.3.80 లక్షల నగదు, రూ.5 లక్షలకు పైగా విలువైన బంగారు నగలను మెహర్ గా ఇచ్చినట్లు బాధితుడు తెలిపాడు. నవ వధువు కాపురానికి వచ్చిన తర్వాత కొన్ని రోజులకు ఆసుపత్రికని వెళ్లి పారిపోయిందని బాధితుడు వాపోయారు.

మరో బాధితుడి సోదరుడు అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ.. తమకు ఓ వ్యక్తి రాత్రి సమయంలో మహిళను చూపించాడని, రాత్రి మాత్రమే పెళ్లి చేశాడని చెప్పాడు. చదూర బుద్గాంలో 10 రోజులుగా మహిళ తమ వద్ద ఉందని, అయితే ఆ తర్వాత ఆమె పారిపోయిందని ఆయన చెప్పారు. మరో బాధితుడు మహ్మద్‌ అల్తాఫ్‌మీర్‌ మాట్లాడుతూ.. తనకు అదే మహిళతో వివాహమైందని తెలిపారు. రాత్రి సమయంలో ఇంట్లో ఉన్న వస్తువులతో ఆమె ఇంటి నుండి అదృశ్యమైందని చెప్పారు. అదే మహిళను వివాహం చేసుకున్న బుద్గామ్‌కు చెందిన మరో వ్యక్తి నిసార్ అహ్మద్, ఆ మహిళ (అతని భార్య) తన తల్లితో కలిసి ఆసుపత్రికి వెళ్లిందని, అక్కడ నుండి కూడా తప్పించుకుందని చెప్పాడు. దాదాపుగా మిగతా బాధితుల అనుభవం కూడా ఇలాగే ఉందని పోలీసులు తెలిపారు. ఇలా ఒక్క బుద్గాం జిల్లాలోనే 27 మందిని సదరు మహిళ మోసం చేసింది. అందులో కేవలం 12 మంది మాత్రమే ఫిర్యాదు చేయడానికి ముందుకు వచ్చారని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఉదంతం మొత్తం నెట్ ఫ్లిక్స్ లో వచ్చే సీరియల్ లా ఉందంటూ జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. కాగా సదరు మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Next Story