కడక్‌నాథ్ చికెక్‌కు భారీ డిమాండ్.. కిలోకు రూ.1200.. ఎందుకంత డిమాండ్..!
High Demond for Kadaknath chicken. మార్కెట్లో నాటు కోళ్లకు డిమాండ్ ఎక్కువే. అయితే నాటుకోడి జాతికి తలదన్నే ఓ నాటు
By తోట వంశీ కుమార్ Published on 2 March 2021 2:31 PM GMTమార్కెట్లో నాటు కోళ్లకు డిమాండ్ ఎక్కువే. అయితే నాటుకోడి జాతికి తలదన్నే ఓ నాటు కోడికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. మేక మాంసానికంటే ఎక్కువ డిమాండ్ పలుకుతోంది. ఇప్పుడు ఈ కోడి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ కోడి మాంసం ధర వింటే షాకవుతారు. ఏకంగా కిలోకు వెయ్యి నుంచి రూ.1200 వరకు పలకుతోంది. అంతే ఖరీదు ఎందుకంటారా..? ఆ కోడికి అన్ని ప్రత్యేకతలేనట. అవే కడక్ నాథ్ కోళ్లు. ఈ కోళ్ల మాంసం హైదరాబాద్‌లో రూ.1200 వరకు పలుకుతోంది.
కడక్ నాథ్ కోడి మాంసం నల్లటి రంగులో ఉంటుంది. కోడి కూడా అదే రంగులో ఉంటుంది. అయితే ఈ జాతికి చెందిన కోడి ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతుంటారు. ఇందులో అతి తక్కువగా క్రొవ్వు పదార్థం ఉంటుంది. మంచి రుచిగా ఉండడమే కాకుండా ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉండటంతో ఈ కడక్‌నాథ్ చికెన్‌కు డిమాండ్ భారీగా ఉంటుంది.సాధారణంగా కడక్‌నాథ్ బ్రీడ్ మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, రాజస్థాన్‌లలోని గిరిజన ప్రాంతాల్లో దొరుకుతుంటాయి. కొందరైతే ఈ జాతి కోళ్లను ప్రత్యేకంగా పెంచుతారు.ఈ కోడి మొత్తం నలుపు రంగులోనే ఉంటుంది. దీని గుడ్లు కూడా నల్లగా ఉంటాయనే ప్రచారం ఉన్నప్పటికీ వాస్తవానికి అవి కాస్త కాఫీ రంగుతో పాటు కొంత పింక్ కలర్‌లో ఉంటాయి.
కడక్‌నాథ్ కోళ్లను మాసం కోసం, గుడ్ల కోసం పెంచుతారు. అయితే టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ కడక్‌నాథ్ కోళ్ల బిజినెస్ పెడుతున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో కడక్‌నాథ్ చికెన్‌కు బాగా ప్రాచూర్యం లభించింది. వాటి గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఇంటర్నెట్‌లో తెగ సెర్చ్ చేయడంతో మన తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే చాలా మంది ఈ కోళ్లను ప్రత్యేకంగా పెంచుతున్నారు. ఈ కోళ్లను ఇతర రాష్ట్రాలకు సరఫరా బాగా జరుగుతుంది.