కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించింది. ఈ మహమ్మారి కారణంగా బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే ఖచ్చితంగా ఫేస్ మాస్క్ ధరిస్తున్నారు. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ ఇటీవలే అందుబాటులోకి వచ్చినప్పటికి ఇంకా ఈ మహమ్మారి పూర్తిగా నిర్మూలన కాలేదు. దీంతో జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అయింది. హోటల్స్, రెస్టారెంట్లు, వ్యాపార దుకాణాలు, కంపెనీల్లో సైతం ముఖానికి మాస్క్ లేకుంటే లోపలికి రావద్దని బోర్డులు పెట్టడం చూస్తూనే ఉన్నాం.అయితే.. ఓ హోటల్ పెట్టిన బోర్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ముఖానికి మాస్క్‌లు ఉన్న వాళ్లు తమ హోటల్‌కు రావద్దని బోర్డు పెట్టడమే అందుకు కారణం. ఇంకా విచిత్రం ఏంటంటే సదరు హోటల్ మాస్క్‌లను డైపర్లతో పోల్చడం ఇక్కడ గమనించాల్సిన విషయం.
అమెరికా ఫ్లోరిడాలోని హెర్నాండో కౌంటీలో ఉన్న 'బెక్కి జాక్ ఫుడ్ షాక్' అనే రెస్టారెంట్ ఎంట్రన్స్ ముందు ఒక ఫోటో పెట్టింది. ఆ ఫోటోమీద 'మా రెస్టారెంట్‌కు వచ్చేవారు ఫేస్ డైపర్లు ధరించాల్సిన అవసరం లేదు.. అందరికీ స్వాగతం' అని ఉంది. అదేంటీ ముఖానికి ఎవరన్నా డైపర్లు వేసుకుంటారా? అని షాక్ అవుతున్నారా? కానేకాదు.. సదరు రెస్టారెంట్ ఉద్ధేశమేమంటే.. మాస్కుల్ని డైపర్లతో పోల్చింది. అందుకే ముఖానికి డైపర్లు వేసుకుని మా రెస్టారెంట్ కు రావద్దని చెప్పింది. అంతేకాదు ఈ విషయాన్ని తమ ఫేస్‌బుక్ పేజీలోనూ పోస్టు చేసింది. ఇంకేముంది క్షణాల్లో ఇది వైరల్‌గా మారింది.
దీన్ని ఆరోగ్య నిపుణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చినా అదింకా నిర్మూలన కాలేదు. అటువంటి సమయంలో ఇటువంటి ప్రకటనలు బాధ్యతారాహిత్యమని అంటున్నారు. తాము ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడుతోంటే.. ఇలా బాధ్యత లేకుండా చేయటం సరైంది కాదని అంటున్నారు.