మావటికి కన్నీటి వీడ్కోలు పలికిన ఏనుగు.. గుండెల్ని బరువెక్కిస్తున్న వీడియో

Elephant comes bid final farewell his mahout.మ‌నుషులు, జంతువుల మ‌ధ్య ఉన్న అనుబంధం గురించి ప్ర‌త్యేకంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Jun 2021 11:17 AM GMT
మావటికి కన్నీటి వీడ్కోలు పలికిన ఏనుగు.. గుండెల్ని బరువెక్కిస్తున్న వీడియో

మ‌నుషులు, జంతువుల మ‌ధ్య ఉన్న అనుబంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర‌లేదు. ఎందుకంటే ఈ అనుబంధం చాలా గొప్పది, విడదీయలేనిది. ఆ మూగ జీవాలు చూపించే ప్రేమ అమూల్యం. కంటికి రెప్ప‌లా చూసుకున్న మావ‌టికి, ఓ ఏనుగు అశ్రునివాళి అర్పించింది. ఈ ఘ‌ట‌న కేర‌ళ‌లోని కొట్టాయంలో జ‌రిగింది. ప్ర‌స్తుతం ఇందుకుసంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. చనిపోయిన తన మావటిని కడసారి చూసేందుకు గజరాజు తరలివచ్చిన దృశ్యాలను ఆ వీడియోలో క‌నిపించింది. విగతజీవుడిలా పడివున్న ఆ మావటిని పిలుస్తున్నట్టుగా తొండం పైకెత్తి పలుమార్లు ఆ ఏనుగు ప్రదర్శించిన హావభావాలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి.

కూర‌ప్పుడకు చెందిన ప్ర‌సిద్ద మావ‌టి దామోద‌ర‌న్ నాయ‌ర్ గ‌త 60ఏళ్లుగా ఏనుగులను సంర‌క్షిస్తున్నారు. ప‌ల్ల‌బ్ బ్ర‌హ్మ‌దాత‌న్ అనే ఏనుగుకు పాతికేళ్లుగా ఆయ‌న సంర‌క్ష‌కుడిగా ఉన్నాడు. అత‌డికి ఆ ఏనుగుతో అవినాభ సంబంధం ఏర్ప‌డింది. ఆయన వయసు 74 ఏళ్లు. స్థానికులు ఆయణ్ని ఒమనాచెట్టన్ అని పిలుచుకుంటారట. అంటే.. అందరి బాగోగులు చూసే పెద్దన్న అని అర్థం. ఓమనచెట్టన్‌ క్యాన్సర్‌ వ్యాధితో పోరాడుతూ జూన్‌ 3న మరణించాడు. మావటి చనిపోయిన రోజు అతని ఇంటికి వచ్చిన బ్రహ్మదత్తన్‌ కన్నీటితో వీడ్కోలు పలికాడు. తొండమెత్తి దందాలు పెట్టాడు. ఈ దృశ్యం చూసిన స్థానికుల గుండెలు ద్రవించిపోయాయి. ఈ వీడియోలో ఏనుగు ప్రేమాభిమానాలు చూసిన నెటిజన్లు కూడా ఎమోషనల్‌ అవుతున్నారు.

Next Story