అదృష్టం ఎవరి తలుపు ఎప్పుడు తడుతుందో తెలియదు. ఒక్కసారి తలుపు తట్టిందా ఇక జీవితం మారిపోయినట్లే అప్పుల్లో కూరుకుపోయిన ఓ వ్యక్తి తన కెంతో ఇష్టమైన ఇంటిని అమ్మకానికి పెట్టాడు. ఇంకో కొన్ని గంటల్లో ఆ ఇల్లు అతడి చేజారిపోతుందనగా లాటరీ రూపంలో అదృష్టం అతడి తలుపు తట్టింది. ఏకంగా కోటి రూపాయల జాక్ పాట్ తగిలింది. ఇంకేముంది అతడి జీవితం మారిపోయింది.
వివరాల్లోకి వెళితే.. కేరళలోని కోజికోడ్‌కు చెందిన మహ్మద్ బవ(50) వృత్తిరీత్యా పెయింటర్. ఇతడికి భార్య, నలుగురు కుమారైలు, ఓ కుమారుడు. 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎనిమిది నెలల క్రితం ఎంతో ఇష్టంగా సొంతింటిని నిర్మించుకున్నాడు. ఇద్దరు కుమారైల పెళ్లిళ్లు చేయడం, కుమారుడిని ఖతార్ పంపించడంతో దాదాపు రూ.50లక్షల వరకు అప్పులు అయ్యాయి. అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో ఇంటిని అమ్మి అప్పులు తీర్చాలని బావించాడు.
ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారితో రూ.40లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ముందుగా కొంత అడ్వాన్స్‌ను కూడా తీసుకున్నాడు. అయితే..అతడికి లాటరీలు కొనే అలవాటు ఉంది. ఓ నాలుగు లాటరీ టికెట్లు కొన్నాడు. ఆదివారం లాటరీ నిర్వాహకులు డ్రా తీయగా మహ్మద్‌కు జాక్‌పాట్ తగిలింది. లాటరీ మొత్తంలో పన్నులు పోగా అతడి చేతికి రూ.63లక్షలు అందనున్నాయి. ఈ విషయం తెలిసిన మహ్మద్ ఎగిరి గంతులేశాడు. తన ఇంటిని అమ్మనని చెబుతున్నాడు.